తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో .. కొన్ని వందల కోట్లు పెట్టి అభివృద్ధి పనులు చేస్తూంటారు. మిగతా నియోజకవర్గాల్లో రోడ్ల రిపేర్లకు డబ్బులుండవని.. విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నా.. లెక్క చేయరు. ఏపీ సీఎం.. తన నియోజకవర్గం పులివెందులలోనూ అలాగే అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించారు. ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా సమీక్ష చేసిన జగన్.. కనీసం రూ. 300 కోట్లకుపైగా విలువైన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పులివెందులలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఆదేశించారు. రోడ్లు, పార్కులు, కాలేజీలు..సబ్ స్టేషన్లు ఇలా.. ప్రతీ ఒక్క పనికి ఆమోదం తెలిపారు.
పులివెందుల నియోజకవర్గంలో వెంటనే కొత్తగా 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. వేంపల్లి సీహెచ్‌సీకి రూ.30 కోట్లతో మౌలిక సౌకర్యాలు కల్పించనున్నారు. ఇక పులివెందుల మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్టీపీకి రూ.50 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేయాలనిసూచించారు. పులివెందులలో కొత్త ఫైర్ స్టేషన్ బిల్డింగ్.. అలాగే వేంపల్లిలో కొత్త ఫైర్ స్టేషన్ మంజూరు చేశారు. పులివెందులలో రూ. 17.65 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్ కాంప్లెక్స్, నాడు- నేడు పథకం కింద రూ.30 కోట్లతో స్కూళ్ల అభివృద్ధి, వేంపల్లిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జెఎన్టీయూ పులివెందులలో కొత్త లెక్చర్ కాంప్లెక్స్, నైపుణ్యాభివృద్ది కేంద్రానికి రూ. 10 కోట్ల నిధుల విడుదల చేశారు. సింహద్రిపురం, వేంపల్లి పాలిటెక్నిక్ కాలేజీలకు రూ. 15 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ది చేస్తారు. పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి ఆరేళ్ల కిందటవి..అంటే 2012 – 13 రబీ పంటకు సంబంధించి ఇన్సూరెన్స్ భీమా సొమ్ము సుమారు రూ.112 కోట్లు త్వరితగతిన రైతుల ఖాతాలోకి చేరేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశించారు. రెండు నెలల్లోగా రైతుల ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పులివెందుల మార్కెట్‌యార్డ్‌లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ. 5 కోట్లు మంజూరు చేశారు. పులివెందుల నియోజకవర్గంలో కొత్తగా 7 గోడౌన్స్, 1 కోల్డ్ స్టోరేజి ఏర్పాటు చేయనున్నారు. పులివెందుల శిల్పారామానికి సుమారు రూ. 10 కోట్లతో అభివృద్ది ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే.. వేంపల్లిలో మిని శిల్పారామం ఏర్పాటకు భూమి గుర్తింపు, నిర్మాణ ప్రతిపాదనలు, ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్, గండి క్షేత్రం, గండికోట, ఒంటిమిట్ట ప్రాంతాలను కలుపుతూ ఒక టూరిజం సర్కూట్ ఏర్పాటుచేయాలని సూచించారు. అలాగే.. జాతీయ స్ధాయి ప్రమాణాలతో కూడిన విద్యాసంస్ధ ఏర్పాటుచేయాలని ఇందుకు గాను పేరుగాంచిన సంస్ధలను సంప్రదించాలన్నారు. అన్నీ ఉండి.. మాల్ లేకపోతే.. ఎలా అనుకున్నారేమో.. కానీ.. పట్టణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో పులివెందులలో మాల్ కమ్ మల్టిప్లెక్స్ ఏర్పాటుకు అవకాశాలు పరిశీలించాలని కూడా సూచించారు.