ఆర్టీసీ కార్మికులు సమ్మెను మరింత తీవ్రతరం చేసే దిశగా ఓపక్క ఉద్యమ కార్యాచరణ తయారు చేసుకుంటుంటే… ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు సిద్ధమౌతోంది. ఆర్టీసీ సమస్యే ప్రధాన అజెండాగా శనివారం నాడు మంత్రి వర్గ సమావేశం జరగాలని నిర్ణయించింది. నవంబర్ 2న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం అవుతుంది. కార్మికుల డిమాండ్లు, సమ్మె తీవ్రతపై చర్చించడంతోపాటు, అదే రోజున కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం వెలువరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓపక్క కోర్టులో కూడా ఆర్టీసీ సమస్యపై వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంలో విలీనమే ప్రధాన డిమాండ్ గా ఆర్టీసీ కార్మికులు పట్టుబడుతున్నా, దాన్ని పరిగణనలోకి తీసుకునేందుకు కేసీఆర్ సర్కారు ఏమాత్రం సుముఖంగా లేదనేది తెలిసిందే.
సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలను అందుబాటులోకి తేవాలంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా చెప్పేశారు. 30 శాతం అద్దె బస్సులు, 20 శాతం ప్రైవేటు బస్సులను తీసుకోవాలని… మిగతా 50 శాతం యాజమాన్య బస్సులు ఉంటాయనే ప్రతిపాదనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే తెరమీదికి తెచ్చారు. ఇప్పుడు దానికే ప్రభుత్వం కట్టుబడి మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే అద్దె బస్సులు చాలా ఉన్నాయి. ఇక మిగిలింది ప్రైవేటు కేరియర్లను రంగంలోకి దించడం. దానికి అనుగుణంగానే ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇచ్చే ప్రకటనను అధికారికంగా ఆరోజు చేసే అవకాశం ఉందని సమాచారం. దాదాపు 5 వేల రూట్లలో ప్రైవేటు స్టేజ్ కేరియర్లకు అనుమతులు ఇచ్చేందుకు అధికారుల స్థాయిలో కసరత్తు మొదలైందని తెలుస్తోంది.
మొత్తానికి, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్లను కేసీఆర్ సర్కారు పరిగణిస్తున్నట్టుగా లేదు. విలీనంతో సహా ప్రధానమైన డిమాండ్లపై ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నా… తాము అనుకున్నదే చేసి తీరతామనే పద్ధతిలో సీఎం కేసీఆర్ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకునేందుకు రంగం సిద్ధమౌతున్నట్టుగా ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది. శనివారం జరిగే కేబినెట్ నిర్ణయం ఎలా ఉంటుందో, కోర్టు ఆదేశాలు ఏవిధంగా ఉంటాయో వేచి చూడాల్సిందే.