తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని కలిశారు. ఈ సందర్భంగా వారి డిమాండ్లను, కేసీఆర్ సర్కారు వైఖరిని పవన్ కి వివరించి, సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం మీడియాతో పవన్ మాట్లాడుతూ… 27 రోజులుగా సమ్మె జరుగుతోందనీ, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతూ ఉండటం బాధాకరమన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు తెలిపిన ఆర్టీసీ కార్మికుల గోడును ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. పరిస్థితి ఒక కొలీక్కి వచ్చే విధంగా కనిపించడం లేదనీ, మనదేశంలో ప్రతీ ఒక్కరూ తమ బాధను వ్యక్తీకరించే హక్కు ఉంటుందన్నారు. ఆర్టీసీ సమస్య చర్చల ద్వారా పరిష్కారమవ్వాలని ఇన్నాళ్లూ కోరుకున్నా అన్నారు. 48 వేల మంది ఉద్యోగులతోపాటు, వారి పిల్లలూ కుటుంబాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసే ప్రయత్నం తాను చేస్తాననీ, రాబోయే రెండ్రోజుల్లోనే అపాయింట్మెంట్ కోరతానని పవన్ చెప్పారు. ఆయన అపాయింట్మెంట్ ఇస్తే చర్చలకు అవసరమైన సుహృద్భావ వాతావరణం క్రియేట్ చేయాలని కోరతానన్నారు. ముఖ్యమంత్రిలో కలిసే అవకాశం లభించని పక్షంలో కార్మిక నాయకుల భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉంటుందో, వారికి తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తా అన్నారు. ఇన్ని వేల కుటుంబాలు ఆకలితో ఉండటం ఎవ్వరికీ మంచిది కాదన్నారు. ఆ తరువాత, ఆర్టీసీ జేయేసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ… ఉద్యమ సమయంలో పాల్గొన్నవారు కొంతమంది ఇప్పుడు మంత్రులుగా ఉన్నారనీ, తమ సమస్యలు చెబితే వారు పట్టించుకోలేదుగానీ, పవన్ సానుకూలంగా స్పందించారన్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టీసీ సమ్మె అంశమై ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ పవన్ కి ఇస్తారా అనేది అనుమానమే! సొంత పార్టీకి చెందినవారే సమ్మె గురించి మాట్లాడని పరిస్థితి! సీఎంని కలవలేని పక్షంలో కార్మిక నేతలకు మద్దతు ప్రకటిస్తా అన్నారు పవన్. అయితే, మద్దతు అంటే… కార్మికులు చేపట్టబోయే కార్యక్రమాల్లో టీడీపీ భాజపా టీజేఎస్ కాంగ్రెస్ పార్టీల నాయకుల మాదిరిగా పవన్ కల్యాణ్ కూడా ప్రత్యక్షంగా పాల్గొంటారా లేదా అనేది స్పష్టంగా చెప్పలేదు. ప్రత్యక్షంగా నిరసన కార్యక్రమాల్లోకి రావడం అనేది ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయంగా పవన్ భావిస్తున్నారని అంటున్నారు!