ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి నేడు జడ్జిమెంట్ డే. ముఖ్యమంత్రి అయ్యానని.. తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు కావాలని.. ఆయన పెట్టుకున్న పిటిషన్ పై రేపు సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ పిటిషన్ ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించడంతో.. తీర్పు ఉత్కంఠ రేపుతోంది. అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కోర్టు నుంచి వ్యక్తిగత హజరు మినహయింపు లభిస్తుందా లేదా అన్నది తేలిపోనుంది. సిబిఐ కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుందనే ఆంశం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేపుతోంది.
సీఎంగా ఉన్నందున… ప్రతివారం హైదరాబాద్ వచ్చి వెళ్లాలంటే.. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని.. అందుకే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్ధించారు. వ్యక్తిగత హజరు మినహయింపు కోరుతూ జగన్ తరఫున దాఖలైన పిటిషన్ విచారణకు అర్హమైందే కాదని, దాన్ని కొట్టేయాలని సీబీఐ వాదించింది. జగన్కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. జగన్ వ్యక్తిగత హోదాలోనే నిందితుడిగా ఉన్నారని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకుని వచ్చింది. ఆయనపై నమోదైన అభియోగాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావితం చూపే తీవ్రమైన నేరాలని గుర్తు చేసింది. వైఎస్ జగన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రిగా రాజ్యాంగ పరమైన పదవిలో ఉన్న నేపథ్యంలో ప్రజా పరిపాలన దృష్ట్యా ఆయనకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అందువల్లే మినహాయింపు కోరుతున్నట్లు జగన్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
జగన్ అక్రమాస్తుల కేసులోసీబీఐ వాదన.. వైసీపీ వర్గాలను కూడా షాక్ కు గురి చేసింది. సీబీఐ అంత తీవ్రంగా వ్యతిరేకించినందున మినహాయింపు లభించదేమోనన్న సందేహం వైసీపీ వర్గాల్లో ఉంది. ఒక వేళ.. అలాంటి పరిస్థితి ఎదురైతే.. రాజకీయంగా.. ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని… వైసీపీ వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. సీఎం హోదాలో ఉన్న జగన్ కోర్టుకు హాజరైతే.. తీవ్ర విమర్శలు వస్తాయి. అలా వారం వారం కోర్టుకు హాజరయ్యే ముఖ్యమంత్రి అనే ప్రచారం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే.. వైసీపీ నేతలు… సీబీఐ కోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.