పెట్టుబడుల ఆకర్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి.. పరిశ్రమల మంత్రికి… ఓ దృక్పధమే లేకుండా పోయింది. పారిశ్రామికీకరణపై గల్లీల్లో సమావేశాలు పెట్టుకుని.. జాతీయస్థాయి వర్క్‌షాపులను సైతం లైట్ తీసుకుంటున్న దృశ్యాలు ఆవిష్కారవుతున్నాయి. ఢిల్లీలో మూడు రోజుల కిందట.. స్టేట్స్ కన్సల్టేషన్ వర్క్‌షాప్ సదస్సు జరిగింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. దీనికి అన్ని రాష్ట్రాల నుంచి పరిశ్రమల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు… ఒకే ఒక్క రాష్ట్రం నుంచి మాత్రమే ప్రాతినిధ్యం లేదు. ఆ ఒక్క రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్. ఈ సమావేశం ప్రాధాన్యత గురించి.. వివరిస్తూ.. లక్ష్యాలను చెబుతూ.. కేంద్రం లేఖ పంపింది. అయినా.. స్టేట్స్ కన్సల్టేషన్ వర్క్‌షాప్ కు ఏపీ నుంచి మంత్రి గౌతం రెడ్డి కానీ.. అధికారులు కానీ వెళ్లలేదు.
కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పరిశ్రమ ప్రతిపాదనల్ని.. ఆయా రాష్ట్రాలకు సిఫార్సు చేస్తుంది. కేంద్రం ప్రత్యేకంగా.. ఎక్కడో పరిశ్రమలు పెట్టలేదు.. రాష్ట్రాల్లోనే పెడుతుంది. తమ తమ రాష్ట్రాల్లో మెరుగైన పరిస్థితులు ఉన్నాయని.. కేంద్రానికి మెరుగ్గా రిప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది. కానీ.. ఏపీ సర్కార్ ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకుంది. అందుకే.. దేశం మొత్తం హాజరైనా… స్టేట్స్ కన్సల్టేషన్ వర్క్‌షాప్ ను లైట్ తీసుకుంది. తెలంగాణ తరపున మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆయన రెండురోజుల ముందుగానే ఢిల్లీ వెళ్లి వర్క్ షాప్ లో ప్రస్తావించాల్సిన అంశాలపై కసరత్తు చేశారు. ఆ తర్వాత కేంద్రమంత్రుల్ని కలిసి.. తెలంగాణకు రావాల్సిన నిధుల గురించీ ఆరా తీశారు.
పరిశ్రమల విషయంలో ఏపీ సర్కార్.. ఇంత నిర్లక్ష్య వైఖరి అవలంభించండం.. కేంద్ర ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చనీయాంశం అయింది. గత ఐదేళ్లలో దేశంలో ఏ ప్రతిష్టాత్మక పరిశ్రమ పేరు వినిపించినా.. అందులో ఏపీ పోటీ పడుతుందనే… పేరు ఉండేది. కానీ ఇప్పుడు.. తమ రాష్ట్రం ప్లస్ పాయింట్లను ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడే వర్క్ షాపుల్లోనూ… పాల్గొనడానికి.. అదీ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వర్క్ షాపుల్లోనూ పాల్గొనడానికి.. ఏపీ సర్కార్ పెద్దలకు తీరిక లేదు. కొసమెరుపేమిటంటే.. అక్కడ వర్క్ షాప్‌నకు పోని పరిశ్రమల మంత్రి గౌతం రెడ్డి… అమరావతిలో.. తన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం పెట్టారు. ప్రతీ పదిహేనురోజులకు ఓ సారి భేటీ కావాల్సిందేనని.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలతోనే పారిశ్రామికీకరణ చేస్తామని.. ఆయన పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు.