డాలర్ శేషాద్రిని తిరుమల నుంచి పంపేయాలనుకున్న ప్రభుత్వం చివరికి వెనక్కి తగ్గక తప్లేదు. రిటైరైపోయి కూడా.. విధుల్లో కొనసాగుతున్న వారిని తక్షణం తీసేయాలంటూ రాష్ట్ర సర్కారు జారీ చేసిన జీవో నంబర్ 2323 ను విడుదల చేసింది. దీన్ని టీటీడీకి కూడా అన్వయించింది. ఈ జీవో మేరకు.. పన్నెండేళ్ల కిందట రిటైరైపోయి… ఇప్పటికీ… చక్రం తిప్పుతున్న డాలర్ శేషాద్రిని కూడా తొలగించడానికి టీటీడీ అధికారులు ఫైల్‌ను సిద్ధం చేశారు. ఆయనను తొలగించాల్సిందేనని.. టీటీడీ అధికారులపై… ఓ వర్గం తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసింది. ముఖ్యంగా.. మళ్లీ .. టీటీడీలోకి రావాలనుకుంటున్న మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు మద్దతుగా ఉండే వర్గం… ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలపైనే ఒత్తిడి పెట్టిందని ప్రచారం జరిగింది.
ప్రభుత్వం కూడా ఇక తొలగించినట్లేనని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ మేరకు వచ్చిన సూచనల ప్రకారమే.. టీటీడీ అధికారులు ఫైల్‌ను సిద్ధం చేశారు. రాత్రికి.. వందమందికిపైగా అలా రిటైరై మరీ ఉద్యోగంలో కొనసాగుతున్న వారిని తొలగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. కానీ.. అందులో డాలర్ శేషాద్రి పేరు లేదు. ఇక తిరుమలలో డాలర్ శేషాద్రి కనిపించరంటూ.. సంబరం చేసుకున్న కొంత మంది మళ్లీ ఫెయిలయ్యామని నిరాశ చెందారు. డాలర్ శేషాద్రిని తిరుమల నుంచి పంపించడానికి… జరిగిన ప్రయత్నాలకు లెక్కే లేదు. 2006లో రిటైర్ అయినా ఇప్పటికీ పొడిగింపు తెచ్చుకుంటూ ఉన్నారు. గతంలో ఆయన పొడిగింపుపై కోర్టు కేసులు నమోదయ్యాయి. ఓ సారి డాలర్ శేషాద్రి నియామకం చెల్లదంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై డాలర్ శేషాద్రి సుప్రీంకోర్టుకు వెళ్లారు. విచారణ తర్వాత సుప్రీంకోర్టు డాలర్ శేషాద్రికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఆయన టీటీడీలో కొనసాగుతున్నారు.
ఏ ప్రభుత్వం వచ్చినా.. ఆయనకు పొడిగింపు అనేది లాంఛనం., ఆలయంలోని ఆయన వ్యతిరేక వర్గాలు.. శేషాద్రిని పంపేయడానికి.. ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నిహితంగా వ్యవహరించినప్పటికీ.. సాధ్యం కావడం లేదు. ఈ సారి కూడా.. అదే పరిస్థితి. దీన్ని బట్టి చూస్తేనే.. డాలర్ శేషాద్రికి … ఉన్న పలుకుబడి అర్థం చేసుకోవచ్చంటున్నారు. శ్రీవారికి జరిగే సేవల విషయంలో.. ఆయన చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు. ఆలయం గురించి.. శ్రీవారి పూజల గురించి.. ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని.. టీటీడీ వర్గాలే చెబుతూంటాయి. ఆయన రాకపోతే… పూజాకైంకర్యాలు చేసే వారిలో చాలా మందికి కాళ్లూ చేతులూ ఆడవు. బ్రహ్మోత్సవాలు వ్యవహారాలు మొత్తం ఆయనే దగ్గరుండి చేస్తారు. ఆయన సేవలు ఆయన కోరుకున్నంత కాలం.. కొనసాగుతాయని.. తాజా పరిణామాలే నిరూపిస్తున్నాయి.