వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గట్టిగా షాక్ తగిలింది. ముఖ్యమంత్రిగా అయినందున.. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు మినహాయింపు కావాలన్న ఆయన పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ప్రతీ వారం విచారణకు తప్పనిసరిగా రావాల్సిందేనని స్పష్టం చేసింది. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి…ఏపీ ఎన్నికలలో గెలిచిన తర్వాత.. ఐదు నెలలుగా.. సీబీఐ కోర్టుకు రాలేదు. గతంలో పొందిన బెయిల్ షరతుల ప్రకారం.. కోర్టు విచారణ ప్రక్రియకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రతీ వారం ఆయన కోర్టుకు హాజరవుతున్నారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అలా హాజరవడం వల్ల తన సమయం వృధా అవుతుందని.. ప్రజాధనం వృధా అవుతుందని.. ఆయన వాదిస్తూ.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం పిటిషన్ వేసుకున్నారు.
జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వవొద్దని సీబీఐ చాలా గట్టిగా వాదించిది. ఆయన వ్యక్తిగత హోదాలో నిందితుడిగా ఉన్నారని.. ముఖ్యమంత్రి పదవితో సంబంధం లేదని తేల్చారు. పైగా సాక్షులుగా ఉన్న కొంత మంది అధికారులు ఆయన దగ్గర పని చేస్తున్నారని.. ఆయన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఎక్కువగా ఉందని వాదించారు. చట్టం ముందు అందరూ సమానమేనని రాజ్యాంగం చెప్పిందని.. జగన్ తాను.. ముఖ్యమంత్రినయ్యానని చెప్పి .. మినహాయింపు కోరడం.. రాజ్యాంగ విరుద్ధమని సీబీఐ వాదించింది. సీబీఐ వాదనతో… కోర్టు ఏకీభవించింది. జగన్ పిటిషన్‌ను కొట్టి వేసింది. అయితే జగన్ తరపు న్యాయవాదులు… హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా.. జగన్మోహన్ రెడ్డి ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుంది. అయితే.. ఇలా చేయడం నైతికత కాదు. ముఖ్యమంత్రి పదవికే మచ్చ వస్తుంది. అందుకే ఆయనపై తీవ్రమైన విమర్శలు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా .. ఇలాంటి పరిస్థితి వస్తే.. రాజీనామా చేయమనే డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. జగన్ విషయంలోనూ.. ఇప్పుడు… అదే జరిగే అవకాశం ఉంది. అయితే జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరం..!