తెలుగు360 రేటింగ్: 2.75/5
ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లోనూ ఏదో ఓ రహస్యం ఉంటుంది.
అది రహస్యంగా ఉన్నంత వరకే మనది.
ఆ రహస్యం బయటకు పొక్కేస్తే.. సోషల్ మీడియాది.
ఓ అబ్బాయికీ అలాంటి రహస్యమైన వీడియో ఒకటుంది. రేప్పొద్దుట పెళ్లి అనగా.. ఓ వీడియో బయటకు వచ్చేసింది. ఆ వీడియో చుట్టూ ఓ కథ అల్లుకుంటే..?
– పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. విజయ్ దేవరకొండకు అదే నచ్చింది. దాంతో ‘మీకు మాత్రమే చెప్తా’ తయారైపోయింది.
తనని హీరోగా చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ని హీరోగా మార్చడం దగ్గర్నుంచి, ఈ సినిమాలో చాలా విశేషాలున్నాయి. దాంతో ఈ సినిమా ఎలా ఉంటుందా? అంటూ ఫోకస్ పెరిగింది. మరి.. `మీకు మాత్రమే చెప్తా`లో ఈ సినిమా మాత్రమే ఇవ్వగలిగిన వినోదం, కిక్ ఏమున్నాయి? ఆ సెల్‌ఫో్న్ సీక్రెట్ ఏమిటి?
ఇంట్రడక్షన్‌లోనే కథ అర్థమైపోయి ఉంటుంది. ట్రైలర్, టీజర్‌లోనూ పాయింట్ చెప్పడానికే ప్రయత్నించాడు దర్శకుడు. అయినా టూకీగా చెప్పుకుంటే.. రాకేష్ (తరుణ్ భాస్కర్) ఓ వీడియో జాకీ. కామేష్ (అభినవ్ గోమట్టం) మంచి దోస్తు. స్టెఫీ (వాణీ)ని ప్రేమిస్తాడు. తనో డాక్టర్. తన దగ్గర ప్రతీసారీ అబద్దాలు ఆడి దొరికేస్తుంటాడు. అయినా సరే… స్టెఫీ భరిస్తుంది. ఇద్దరికీ పెళ్లికుదురకుతుంది. రేప్పొద్దుట పెళ్లి అనగా… రాకేష్ వీడియో ఒకటి బయటకు వస్తుంది. ఓ అమ్మాయితో బెడ్ రూమ్ షేర్ చేసుకున్న వీడియో అది. అక్కడ్నుంచి రాకేష్ తిప్పలు మొదలవుతాయి. ఆ వీడియో డిలీట్ చేయడానికి ఒకటే ఉరుకులు.. పరుగులు. మరి ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది? దీని వెనుక ఎవరున్నారు? ఈ విషయం స్టెఫీకి తెలిసిపోయిందా? – ఇవన్నీ ‘మీకు మాత్రమే చెప్తా’ చూసి తెలుసుకోవాల్సిందే.
షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన దర్శకులు నిజంగా గొప్ప ఐడియాలతో వస్తారు. దానికి తగ్గట్టే కష్టపడతారు కూడా. అలాంటి వాళ్లని ప్రోత్సహిస్తే, కాస్త బడ్జెట్, ఇంకాస్త భరోసా కల్పిస్తే… తప్పకుండా మంచి ఫలితాలొస్తాయి. షామీర్ సుల్తాన్ కూడా షార్ట్ ఫిల్మ్ డైరెక్టరే. తాను ఎంచుకున్న పాయింట్ కూడా బాగుంది. కాకపోతే – వీళ్లతో వచ్చిన చిక్కు ఒక్కటే. సినిమా అవసరాలకు తగ్గట్టుగా తమ లైన్‌ని డవలెప్ చేయకపోవడం. ఇంకా షార్ట్ ఫిల్మ్ స్థాయి దగ్గరే ఆగిపోతారు. వాళ్ల కథలు షార్ట్ ఫిల్మ్ వరకూ బాగుంటాయి. దాన్ని కాస్త సాగదీస్తే సినిమా అయిపోతుందనుకుంటారు. కానీ.. అక్కడే పల్టీ కొడుతుంటారు.
షామీర్ ఎంచుకున్నకథలోనే కావల్సినంత థ్రిల్, ఫన్ ఉన్నాయి. వీడియో హీరోయిన్ చూస్తుందా, లేదా? అనేది థ్రిల్లింగ్ మూమెంట్. దాన్ని ఆపడానికి చేసే ప్రయత్నాలు ఫన్ ఎలిమెంట్. ఈ రెండూ భలే మిక్స్ చేసే అవకాశం దొరికింది. కథని కాస్త స్లో ఫేజ్‌తో మొదలెట్టాడు షామీర్. అయినా అదేమంత ఇబ్బంది కలిగించదు. ఎప్పుడైతే.. ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుందో, అప్పుడు బండి పూర్తిగా ట్రాక్ ఎక్కేస్తుంది. రాకేష్ పడుతున్న టెన్షన్‌లోంచి పుడుతున్న కామెడీ, ఈ కథలోకి వస్తున్న కొత్త పాత్రలు, మధ్యమధ్యలో `వారియర్` లాంటి లవరు తపన, మరోవైపు కామూ చేసే గోల… ఇవన్నీ మిక్సయి మంచి టైమ్ పాస్ అయిపోతుంది. చాలా చిన్న పాయింటుని భలే చెబుతున్నాడే అంటూ దర్శకుడ్ని మెచ్చుకోబుద్ధి వేస్తుంది. నిజానికి కథని చిన్న పాయింట్‌తో అక్కడక్కడ తిప్పడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. స్క్రీన్‌ప్లే తెలివితేటలు, రైటింగ్ స్కిల్స్ రెండూ ఉండాలి. దాన్ని షామీర్ బాగానే ప్రదర్శించాడు. తెలంగాణలో సామాన్య జనం మాట్లాడుకునే పదాలే.. డైలాగ్స్‌లా వాడాడు. దాంతో.. ఈ కథకు ఇంకాస్త సహజత్వం అబ్బింది. వీడియో చుట్టూ నడిచే కామెడీ, ఓ పక్కన వ్యూస్ పెరుగుతున్నట్టు స్క్రీన్‌పై చూపించిన విధానం… యాడ్ ఆన్ అయ్యాయి.
ఇదంతా.. తొలి సగం వరకే. ద్వితీయార్థంలో దర్శకుడు సమస్యల్లో పడ్డాడు. ఈ కథని ఎలా ముందుకు నడపాలో తెలీక.. అక్కడక్కడే తచ్చాడాడు. హ్యాకర్ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం, డబ్బులు పోగేయడం, ఓ పక్క రిసెప్షన్ జరుగుతుంటే, పాత్రలన్నీ రన్నింగ్ కామెంట్రీలా మాట్లాడుకోవడం ఇవన్నీ సాగదీత వ్యవహారాల్లా అనిపిస్తాయి. తొలిభాగంలో ప్లస్ పాయింట్‌గా మారిన వినోదం కూడా ద్వితీయార్థానికి వచ్చేసరికి కనిపించకుండా పోయింది. పతాక సన్నివేశాల్లో ట్విస్టు ఇవ్వకపోతే… అసలు సినిమానే గుర్తించరేమో అని దర్శకుడు ఆలోచించి ఉంటాడు. అక్కడ అవసరం లేని ట్విస్టు ఒకటి కల్పించి…మళ్లీ రివర్స్ స్క్రీన్ ప్లే వేయించి ఇంకాస్త సాగదీశాడు. హ్యాకర్ ఎవరు? తన వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? అనేవి కూడా కథకు అనవసరం. వాటిని కూడా జోడించడంతో – సాగదీత భారం ఇంకాస్త సాగుతుంది. గంటలో ముగించగలిగే స్టఫ్ ఉన్న కథ ఇది. దాన్ని రెండు గంటల వరకూ లాక్కురావాలనుకున్నారు. అదే ఈ కథలో పెద్ద సమస్య.
తరుణ్ భాస్కర్ ఏం నటిస్తాడులే.. అని రిలాక్స్డ్‌గా కూర్చుంటే – తప్పకుండా షాక్ ఇస్తాడు. తెరపై నిజమైన రాకేష్‌లా ప్రవర్తించాడు. తన డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్… ఇవన్నీ ఏమాత్రం సినిమాటిక్‌గా అనిపించవు. తరుణే అనుకుంటే… అభినవ్ అయితే మరీనూ. కాము పాత్ర ఈ సినిమాకి బ్యాక్ బోన్. కామూ లేకుండా – ఈ సినిమాని ఊహించలేం. తరుణ్ – అభినవ్ కెమిస్ట్రీ కూడా భలేగా కుదిరింది. దాదాపు 90 శాతం ఫుటేజీ వీళ్ల కోసమే తీసుంటారంటే, ఈ పాత్రలు రెండూ ఎంత డామినేట్ చేశాయో అర్థం చేసుకోవచ్చు. అనసూయని మినహాయిస్తే… ఎవ్వరివీ తెలిసిన మొహాలు కాదు. కథానాయికతో సహా.
ఈ కథని పాయింట్‌గా చెబితే – `దీన్ని కూడా సినిమాగా తీయొచ్చా` అనే డౌటు చాలామందికి వస్తుంది. పాయింటు కొత్తగా ఉన్నా, సినిమాకి కావల్సినంత స్టఫ్ లేదన్న విషయం అర్థమవుతూనే ఉంది. కానీ విజయ్ దేవరకొండ దర్శకుడ్ని నమ్మాడు. తాను కూడా కొంతమేర తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. షామీర్‌లోని రైటర్ ఆకట్టుకుంటాడు. తరుణ్ భాస్కర్ కూడా డైలాగ్స్ విషయంలో సహాయం చేశాడు. ద్వితీయార్థంలో కామెడీ వర్కవుట్ అయితే బాగుండేది. అనవసరమైన ట్విస్టు ఇచ్చి కథని పాడుచేయకపోతే ఇంకా బాగుండేది. విజయ్ దేవరకొండ నిర్మాతగా తీసిన తొలి సినిమా ఇది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే… షార్ట్ ఫిల్మ్ కంటే దారుణంగా ఉన్నాయేమో అనిపిస్తుంది. ‘నా సంపాదనలో 70 శాతం ఈ సినిమాకే పెట్టా’ అని విజయ్ ఎందుకన్నాడో, ఎలా అన్నాడో మరి. డబ్బులు ఇచ్చినంత మాత్రాక కథ మారకపోవచ్చు గానీ, క్వాలిటీ తెరపై కనిపించేది. విజయ్ ఈ సినిమాని వీలైనంత తక్కువ బడ్జెట్‌లో తీద్దామని భావించి ఉంటాడు. అందుకే నిర్మాతగా మరీ పిసినారి అయిపోయాడు. నేపథ్య సంగీతం, కెమెరా వర్క్.. ఇవన్నీ విజయ్ బడ్జెట్ పరిమితులకు లోబడే ఉన్నాయి. పాటలు లేకపోవడం, రెండుగంటల్లో సినిమా ముగించడం కాస్త ప్లస్ అనుకోవాలి.
ఆసక్తి కరమైన పాయింట్‌తో వచ్చే దర్శకులు, ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చే కుర్రాళ్లు.. సినిమాకి కావల్సిన అవసరాల్ని గుర్తించాలి. చిన్న చిన్న కథలతో థియేటర్లో ప్రేక్షకుల్ని కూర్చోబెట్టగలమా? లేదా ఆ పాయింట్‌కి సబ్ ఫ్లాట్‌గా ఏదైనా జోడించగలమా? అనేవి ఆలోచించుకోవాలి. లేదంటే.. మంచి కథలన్నీ – ఇటు షార్ట్ ఫిల్మ్స్‌కి అటు సినిమాకీ కాకుండా మధ్యస్థంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
ఫినిషింగ్ టచ్: మత్తువదలరా.. నిద్దుర మత్తు వదలరా
తెలుగు360 రేటింగ్: 2.75/5