వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై.. స్పందించలేకపోతున్నారు. రోజంతా.. జగన్ విషయంలో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపైనే చర్చ జరుగుతున్నా.. వైసీపీ నేతలు కానీ..ఆయన మీడియా కానీ స్పందించలేకపోయింది. తీర్పులో ఒక్కటంటే.. ఒక్క చిన్న మాట కూడా.. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా లేకపోవడంతో… ఈ పరిస్థితి తలెత్తింది. సహజంగా.. వ్యతిరేక ఘటనలు ఏమైనా జరిగినా.. సాక్షి.. కాస్త ఆలస్యంగా అయినా స్పందిస్తుంది.. తమ వెర్షన్ వినిపిస్తుంది. ఈ సారి మాత్రం.. అలాంటి ప్రయత్నమే చేయలేదు. కనీసం.. తాము పైకోర్టుకు వెళ్తామన్న విషయాన్నీ చెప్పడానికి సంకోచించింది.
ఇక వైసీపీ నేతలు.. మంత్రులు రోజంతా.. వివిధ అంశాలపై ప్రకటనలు చేశారు కానీ.. సీబీఐ కోర్టు తీర్పు పై స్పందించడానికి సంకోచించారు. జర్నలిస్టులు అడిగినప్పటికీ.. స్పందించలేదు. అలాంటి ప్రశ్నలు వేయవద్దని.. ముందుగానే… కొంత మందితో చెప్పించారు కూడా. త్వరలో అక్రమాస్తుల కేసులో రోజువారీ విచారణ జరగబోతోందని వైసీపీ నేతలు కూడా నమ్ముతున్నారు. ఈ క్రమంలో సీబీఐ .. జగన్ బెయిల్ రద్దు కోసం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తుందన్న ప్రచారమూ జరుగుతోంది. అందుకే.. ఏం మాట్లాడితే.. ఏం ముంచుకొస్తుందోనన్న అభిప్రాయంతో… సైలెంట్ గా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
వైసీపీలో కొద్ది రోజులుగా.. కొంత మంది సీనియర్లు…దూకుడుగా ఉంటున్నారు. కారణాలు ఏమిటనేదానిపై… వైసీపీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతున్నా… ఏదో ముంచుకురాబోతోందని… అవకాశాల్ని అంది పుచ్చుకునే ప్రయత్నమేనని… గుసగుసలు కూడా ఉన్నాయి. మొత్తానికి వైసీపీలో ఈ శుక్రవారం.. ప్రకంపనలే సృష్టించింది.