ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై హైకోర్టులో యాజమాన్యం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపైనే సుదీర్ఘంగా వాదనలు జరిగాయి అయితే,దీనిపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. చాలా అనుమానాలను వ్యక్తం చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగానూ ప్రభుత్వం నుంచి ఇవ్వాలసిన రాయితీ మొత్తం రూ. 644 కోట్లను టి.సర్కారు చెల్లించేసిందని తెలిపింది. గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ నడుపుతున్నందుకు వస్తున్న నష్టాన్ని జీహెచ్ ఎంసీ భరించే స్థితిలో ఇప్పుడు లేదనీ, ఇవ్వాల్సిన బకాయిలపై వారూ చేతులు ఎత్తేశారనే అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాటిని బకాయిలుగా చెప్పలేమని ఆర్టీసీ యాజమాన్యం తేల్చి చెప్పేసింది. ఈ రెండు అంశాలూ ప్రధానంగా దాఖలు చేసిన నివేదికపై కోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. ఇంతకీ రీఎంబర్స్ మెంట్ అంటే ఏంటీ, ఎవరివ్వాలీ… ఇవన్నీ నివేదికలో స్పష్టంగా లేవనీ, స్పష్టమైన వివరాలతో మరో నివేదిక ఇవ్వాలంటూ న్యాయస్థానం పేర్కొంది.
గడచిన సెప్టెంబర్లో రవాణా శాఖ మంత్రి అసెంబ్లీలో కొన్ని వ్యాఖ్యలు చేసిన అంశం వాదోపవాదాల్లో ప్రస్థావనకు వచ్చింది. జీహెచ్ ఎంసీ నుంచి కొన్ని కోట్ల రూపాయలు తమకు రావాల్సి ఉందనీ, రీఎంబర్స్ మెంట్ సొమ్మును కూడా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందనీ, అవన్నీ వచ్చేస్తే ఆర్టీసీకి ఎలాంటి ఢోకా లేదని మంత్రి అన్నారు. ఇదే అంశాన్ని కోర్టు ఉటంకిస్తూ… మంత్రి సభలో అలా చెప్పినప్పుడు, ఇప్పుడు ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిందేమీ లేదని ఇన్ ఛార్జ్ ఎండీ ఎలా కౌంటర్ చేస్తారంటూ ప్రశ్నించింది. అసెంబ్లీలో మంత్రి చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ అని భావించాలా, లేదా మీరిచ్చిన నివేదికే కరెక్ట్ అని పరిగణించాలంటూ అంటూ ఆర్టీసీ ఎండీని కోర్టు ప్రశ్నించింది. గ్రాంటు వేరు, లోను వేరు, రీఎంబర్స్ మెంటు ఇంకోరకమనీ, గ్రాంట్లను కూడా రీఎంబర్స్ మెంట్లుగా ఎలా చూపిస్తారని న్యాయస్థానం నిలదీసింది.
నివేదికను చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను దాచారా అనే అనుమానం కలుగుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీసీ ఎండీ సమర్పించిన నివేదికలో… ఆర్టీసీ నష్టాలను జీహెచ్ ఎంసీ భరించాలని ఎక్కడాలేదని పేర్కొనడంపై కూడా కోర్టు మండిపడుతూ… అలాంటప్పుడు గడచిన రెండేళ్లకు ఆర్టీసీకి జీహెచ్ ఎంసీ ఎందుకు చెల్లించిందని ప్రశ్నించింది. మొత్తానికి, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ సమర్పించిన నివేదికపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ… తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.