ఆర్టీసీ బకాయిలకు సంబంధించిన వివరాలను కోర్టుకి అధికారులు ఇవ్వడం, అవన్నీ తప్పుల తడకగా ఉన్నాయంటూ, పొంతనే లేవంటూ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. దీంతోపాటు, సెప్టెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ నిధుల గురించి మంత్రి ప్రకటన ఒకలా ఉండటం, కోర్టుకు ఇచ్చిన వివరాల్లో మరొకలా ఉండటం కూడా కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కోర్టు ఇలా వ్యాఖ్యలు చేయగానే… ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. రాత్రి దాదాపు పది గంటల వరకూ ఈ కార్యక్రమం కొనసాగింది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఈడీలతో సీఎం మాట్లాడారు. రొటీన్ గా ఏం జరిగి ఉంటుందీ… అధికారులపై ముఖ్యమంత్రి ఆగ్రహమో అసంతృప్తో వ్యక్తం చేసి ఉంటారు, అదే జరిగింది!
కోర్టుకు సమర్పించిన వివరాలు ఎందుకు సరిగా లేవు, ఎక్కడ తేడా వచ్చింది అంటూ అధికారులను సీఎం అడిగారు. సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల కోర్టుకు ప్రభుత్వమే అబద్ధాలు చెబుతోందనే అభిప్రాయం కలుగుతోందన్నారు. కనీసం 7న జరిగే విచారణ నాటికైనా కోర్టు ముందు సరైన వివరాలు ఉంచాలంటూ కోరారు. అఫిడవిట్ తయారు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మంత్రి చేసిన ప్రకటన వీడియోని కూడా సీఎం మరోసారి రికార్డులు తీసి చూసినట్టు సమాచారం. ఇదే సమావేశంలో, ఇవాళ్ల కేబినెట్ లో ఆర్టీసీకి సంబంధించిన జరగాల్సిన చర్చపై కూడా సీఎం మాట్లాడినట్టు తెలుస్తోంది.
తప్పుడు వివరాలు ఇచ్చారు అంటూ ఆర్టీసీ ఎండీపై కోర్టు వ్యాఖ్యానించగానే… అదేదో తమకు తెలియకుండా జరిగిపోయిన వ్యవహారంగా, ఆ అఫిడవిట్లో ఏముందో తమకు తెలిసే అవకాశం లేదన్నట్టుగా ముఖ్యమంత్రి స్పందించడం విడ్డూరంగా ఉంది! గతవారంలోనే కదా… కోర్టుకు సమర్పించాల్సిన వివరాలపై జాగ్రత్తగా వ్యవహరించండీ అంటూ అధికారులకు ముఖ్యమంత్రి చెప్పింది. ఓరకంగా చెప్పాలంటే… ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే న్యాయస్థానానికి ఇవ్వాల్సిన నివేదికను ఆర్టీసీ రూపొందించింది. అన్నీ వారి సమక్షంలోనే జరిగి, ఇప్పుడు కోర్టు తప్పు బట్టేసరికి… ఇదంతా అధికారుల తప్పిదమే అనే కలరింగ్ ఇచ్చేలా ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది. అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేయడమెందుకు..? తమ ఆదేశాలనే కదా వారు పాటిస్తున్నది..?