భయం కూడా ఓ కమర్షియల్ ఎలిమెంటే. భయపడటానికి, అందులోని థ్రిల్ ఎంజాయ్ చేయడానికి టికెట్లు కొనుక్కొని మరీ వస్తారు ప్రేక్షకులు. అందుకే హారర్ సినిమాల జోనర్ ప్రపంచ వ్యాప్తంగా సూపర్ పాపులర్ అయ్యింది. టాలీవుడ్ కూడా హారర్ సినిమాలకు తక్కువేం కాదు. ప్రేమకథా చిత్రమ్, గీతాంజలి విజయాల స్ఫూర్తి తో బోలెడన్ని సినిమాలు తయారయ్యాయి. ఒక్కో సీజన్ లో ఐతే.. హారర్ చిత్రాలు దాడి చేసాయనే చెప్పుకోవాలి. ఏడాదికి 150 సినిమాలు రెడీ ఐతే.. అందులో కనీసం 30 సినిమాలు భయపెట్టాయి. చిన్న సినిమా అంటే.. హారర్ కామిడీ నే. చివరాఖరికి అల్లరి నరేష్ లాంటి కామిడీ హీరో కూడా భయపెట్టాడు. తెలుగు సినిమాలు సరిపోవు అన్నట్టు, తమిళం నుంచి కూడా దిగుమతి చేసుకున్నాం.
అలా బోలెడు హారర్ సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ జోనర్ కి కాలం చెల్లిపోయినట్లుగా వుంది. గత కొన్నేళ్ళుగా నికార్సయిన ఒక్క హారర్ సినిమా కూడా రాలేదు. వచ్చినా ప్రేక్షకుల నుండి పెద్దగా ఆదరణ లభించలేదు.
ఇలా ఆదరణ తగ్గిపోవడానికి చాలా కారణాలు వున్నాయి. హారర్ సినిమా అనేసరికి ఒకే సెటప్ లో కధలని చుట్టేసే ప్రయత్నం జరుగుతుంది. ఒక బంగ్లా.. అందులో ఆత్మ.. ఇలాంటి తంతే. అందుకే ప్రేక్షుకులు కూడా రొటీన్ గా ఫీలౌతున్నారు. దానికి తోడు హారర్ కి కామెడీ జోడించి ఇంకా వెకిలిగా హారర్ ని చూపించే దిశగా సినిమాలు తయారుచేస్తున్నారు. దీంతో ఈ సినిమాలపై ఆశక్తి తగ్గిపోతుంది. అందులోనూ.. ఈ సినిమాలకి శాటిలైట్ కావడం లేదు. డిజిటల్ రైట్స్ కూడా అంతంత మాత్రమే. సినిమా హిట్ ఐతేనే కొంటున్నారు. నిర్మాతలు కేవలం థియేటర్ హక్కులపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో నిర్మాతలు కూడా హారర్ సినిమాలపైన ఆసక్తికనబరచడం లేదు. ఈమధ్య వచ్చి రాజుగారి గది 3, నిన్న విడుదలైన ఆవిరి హారర్ సినిమాలే. ఇవి రెండూ ఫ్లాప్ అయ్యాయి. ఈ ఏడాది ఈ జోనర్ లో ఒక్క హిట్టు కూడా పడలేదు. ఈ సినిమా ఫలితాలు దర్శక నిర్మాతలకు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇదే ట్రెండ్ కొనసాగితే.. హారర్ సినిమాల ప్రభ ఇంక వుండకపోవచ్చు.