మీడియాకు సంకెళ్లు వేసేలా.. వివాదాస్పద జీవో తీసుకు వచ్చిన ఏపీ సర్కార్.. సమర్థించుకోవడానికి తంటాలు పడుతోంది. సమాచార పౌర సంబంధాల మంత్రి పేర్ని నాని దీని కోసం.. జగన్‌ను తక్కువ చేసి చెప్పడానికి కూడా సిద్ధమయ్యారు. సచివాలయంలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన … పేర్ని నాని… వైఎస్‌లా.. జగన్ జెయింట్ పర్సనాల్టీ కాదనేశారు. రాధాకృష్ణ, రామోజీరావులు వైఎస్ ను అడ్డుకోవాలని చూడటంతో వారికోసం జీవో నెంబర్ 938ని తెచ్చారని …కానీ ఒక జెయింట్ పర్సనాలిటీగా ఎదిగడంతో.. ఆ జీవోను ఆయనే అభయన్స్ లో పెట్టారన్నారు. ఇప్పుడు రామోజీరావు, రాధాకృష్ణలను ఎలా ఎదుర్కొవాలో తెలియక ఈ జీవో నెంబర్ 2430 తీసుకురావాల్సి వచ్చిందన్నారు.
కోటి రూపాయలు ఖర్చు చేసినా రాని పబ్లిసిటీ తనకు ఆంధ్రజ్యోతి వల్ల వచ్చిందని పేర్ని నాని సంతోషపడ్డారు. ఆ పత్రిక, చానెల్ లో తనపై ఎడిటోరియల్స్ లో ప్రస్తావించడం తనకు ఫ్రీ పబ్లిసిటీయేనని ఆయన క్రెడిట్ క్లెయిమ్ చేసుకున్నారు. కొన్ని పత్రికలకు ప్రకటనలు ఎందుకివ్వటంలేదని మంత్రిని కొంత మంది జర్నలిస్టులు ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు సాక్షికి కూడా ఇవ్వలేదని పేర్ని నాని సమాధానం ఇచ్చారు. దాంతో చంద్రబాబును మీరు కాపీ కొడుతున్నారా అని మీడియా ప్రతినిధులు అడగడంతో… పేర్ని నాని అవాక్కవ్వాల్సి వచ్చింది. తర్వాత అలాంటివి కాపీ కొడితే తప్పు లేదని కవర్ చేసుకున్నారు.
మొత్తానికి మంత్రి పేర్ని నాని.. మీడియా అంటే.. భయపడుతున్నామని చెప్పకనే చెబుతున్నారు. నిజంగానే.. స్వచ్చమైన పాలన అందిస్తూంటే.. భయపడాల్సిన పనేమిటనే అభిప్రాయం.. ఆయన ఎదురుగా ఉన్న జర్నలిస్టుల్లోనే ఏర్పడింది. రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించేలా.. జీవోలు తీసుకొచ్చి మరీ.. తమకు రక్షణ కల్పించుకునే ప్రయత్నం చేయడం.. వస్తున్న ఆరోపణలకు.. సమాధానాలిచ్చుకోలేని పరిస్థితికి చేరవడం వల్లేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నా.. ప్రభుత్వం మాత్రం.. వెనకడుగు వేయడం లేదు. ఈ జీవో తేవడం వల్ల వ్యతిరేక వార్తలు, ఆరోపణలు తగ్గవని.. ఇంకా పెరుగుతాయని.. జాతీయ స్థాయిలో ఇమేజ్ .. సన్నబడుతుందని.. హెచ్చరికలు వస్తున్నా.. ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదు.