ముఖ్యమంత్రి కోర్టు మెట్లెక్కుతారా..? తాను ప్రవచించిన నైతిక విలువలను పాటిస్తారా…? స్వచ్చమైన రాజకీయాల కోసం కీలక నిర్ణయం తీసుకుంటారా..?.. ఇది ఇప్పుడు ఏపీలో జరుగుతున్న చర్చ. ఎన్నికల ప్రచారంలో.. పాదయాత్రలో.. జగన్మోహన్ రెడ్డి… నీతి, నిజాయితీలతో కూడిన రాజకీయాలు.. నైతిక విలువతో కూడిన ప్రజా జీవితం గురించి ప్రవచించేవారు. ఇలాంటి వాటిని తప్పాల్సి వస్తే.. రాజకీయాల నుంచి విరమించుకునేటటువంటి ఆదర్శ రాజకీయవ్యవస్థను తీసుకొస్తానని చెప్పేవారు. ఇప్పుడు… జగన్మోహన్ రెడ్డి తన మాటలు.. ఆదర్శాలను పాటించాల్సిన సమయం వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశ చరిత్రలో.. ఎవరూ ముఖ్యమంత్రి హోదాలో… కోర్టు మెట్లెక్కిన చరిత్ర లేదు. అదీ కూడా… అధికార దుర్వినియోగం చేసి.. వేల కోట్లు ఆస్తులు పోగేసుకున్న కేసుల్లో ఎవరూ.. సీఎం హోదాలో కోర్టు వాయిదాలకు హాజరవలేదు. ఇలా చేయడం.. ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అవుతుంది. నైతిక విలువపరంగా కూడా కరెక్ట్ కాదు.
జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా.. కోర్టు హాజరు నుంచి మినహాయింపు కోసం.. చాలా రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో పాదయాత్ర కోసం వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం వేసిన పిటిషన్ను కోర్టు కొట్టి వేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరోసారి.. దాఖలు చేసిన పిటిషన్ను కూడా కోర్టు కొట్టి వేసింది. వ్యక్తిగత హోదాలో నిందితుడిగా ఉండి… తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టినా… ప్రత్యేకంగా చట్టం చూడదని కోర్టు తీర్పు చెప్పినట్లయింది. హైకోర్టుకు వెళ్లే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉంది. అయితే.. ఆ కోర్టులో తేలే వరకైనా ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.
ప్రజాజీవితంలో ఉన్నప్పుడు… మంచి మాటలు చెప్పినప్పుడు.. ఆ స్వచ్చతను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. సీఎంపై ఉన్నవి.. సీఎం డౌన్ డౌన్ అన్నందుకు ఎమ్మెల్యేలపై పెడుతున్నటువంటి కేసులు.. కాదు కాబట్టి… ప్రజల్లో ఈ అంశం మరింత చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యమంత్రి జగన్ తన పదవిలో ఉండటానికి అర్హుడు కాదని.. తక్షణ పదవి నుంచి వైదొలిగి..కేసులను వేగవంతం అయ్యేలా చూసుకుని.. క్లీన్ చిట్ పొందితే అప్పుడు మళ్లీ పదవి పొందాలనే సూచనలు గట్టిగానే వస్తున్నాయి. ఈ విషయం.. వైసీపీ, టీడీపీకి సంబంధించినది మాత్రమే కాదు. సాధారణ ప్రజలు కూడా ఇది చర్చనీయాంశమే. తమ ముఖ్యమంత్రి వారం వారం అవినీతి కేసుల్లో కోర్టు మెట్లెక్కుతారని.. ఎవరూ ఊహించరు. అందుకే.. జగన్ అక్రమాస్తుల కేసు మరో సారి ప్రజల్లో హాట్ టాపిక్ అవుతోంది. జగన్ తీసుకునే నిర్ణయంపై ఆసక్తి ఏర్పడింది.