టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్, టీవీ9 కొత్త యాజమాన్యం కూర్చుని తమ సమస్యను పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించింది. తనపై అక్రమ కేసులు పెట్టారని.. వాటిని కొట్టి వేయాలంటూ.. రవిప్రకాష్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ సూచన చేసింది. ఈ నెల పదిహేనో తేదీ కల్లా.. రెండు పార్టీలు కూర్చుని చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుని.. తమకు తెలియజేయాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల పదిహేనో తేదీకి వాయిదా వేసింది. టీవీ9 గ్రూప్ నుంచి రవిప్రకాష్‌ను తొలగించిన తర్వాత.. ఆయనపై కొత్త యాజమాన్యం అనేక కేసులు నమోదు చేసింది. వాటిలో ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం, అక్రమంగా బోనస్ తీసుకోవడం, నకిలీ ఈమెయిల్ సృష్టించడం లాంటివి ఉన్నాయి.
మొదటగా నమోదు చేసిన కేసుల్లో… రవిప్రకాష్ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. అయితే.. తరవాత నమోదు చేసిన కేసుల్లో రవిప్రకాష్‌కు అలాంటి అవకాశం ఇవ్వకుండా… ఫిర్యాదు చేసిన రోజే.. అరెస్ట్ చేశారు. దీంతో.. దాదాపుగా రెండు వారాల పాటు రవిప్రకాష్ జైల్లో ఉండాల్సి వచ్చింది. అప్పటికీ.. రవిప్రకాష్ పై నమోదైన కేసులు.. పోలీసులు తీసుకుంటున్న తీవ్ర చర్యలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్న చిన్న కేసులతో మనిషిని జీవితాంతం జైల్లో పెట్టాలనుకుంటున్నారా అని ప్రశ్నించింది. తర్వాత ఆ కేసులపై..బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో.. క్వాష్ పిటిషన్లపై విచారణ జరుగుతోంది.
ఇవన్నీ… వ్యక్తిగత, సివిల్ వివాదాల కిందకు వస్తాయని.. న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో హైకోర్టు కూడా.. కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాలని ఆదేశించింది. అయితే.. టీవీ9 మాజీ సీఈవోకి.. కొత్త యాజమాన్యానికి మధ్య ఇప్పటికి సరిపడని పరిస్థితులు ఉన్నాయి. వ్యాపార వ్యవహారాల్లోనే కాదు… ఇప్పుడు వ్యక్తిగతంగానూ వారి మధ్య దూరం పెరిగింది. సమస్యను పరిష్కరించుకోవాలంటే.. రెండు వర్గాలు.. రాజీపడాల్సి ఉంటుంది. మరి ఇది సాధ్యమయ్యే విషయమో కాదో మరి..!