చంద్రబాబు హయాంలో… చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్..సీఎంవోలో చక్రం తిప్పిన అధికారులకు.. కొత్త ప్రభుత్వంలో ఐదు నెలల తర్వాత పోస్టింగ్ దక్కింది. సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన సీనియర్ ఐఏఎస్ సతీష్ చంద్రను.. వైసీపీ పెద్దలు ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే.. సీఎంవోలో పని చేసిన వారందర్నీ బదిలీ చేశారు. కానీ ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. ఐదు నెలల తర్వాత సతీష్ చంద్రకు పోస్టింగ్ ఇచ్చారు. ఉన్నత విద్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సతీష్‌చంద్రను నియమించారు. కన్నబాబు అనే ఐఏఎస్‌ను గ్రామ వలంటీర్ల పర్యవేక్షణ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక ఆర్టీసీ ఎండీగా ఉన్న సురేంద్రబాబును రాత్రికి రాత్రి బదిలీ చేసి.. కొన్నాళ్లు ఖాళీగా ఉంచారు. ఇప్పుడు.. ఎస్పీఎఫ్ డీజీగా అవకాశం కల్పించారు. ఇసుక, మద్యం అక్రమ రవాణాను అరికట్టే బాధ్యత సురేంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబు హయాంలో కీలకంగా వ్యవహరించిన మరో ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్‌ను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. రాజమౌళి అనే మరో అధికారిని కూడా.. జగన్ సర్కార్ చాలా రోజులు ఖాళీగా ఉంచింది. ఇటీవలే..ఓ అప్రాధాన్య పోస్టును అప్పగించింది. ఓ వైపు.. ఏపీలో పెద్ద సంఖ్యలో ఐఏఎస్‌లను ఖాళీగా ఉంచడమే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి.. డిప్యూటేషన్లపై ఐఏఎస్‌లను తెప్పించుకునే ప్రయత్నాన్ని ఏపీ సీఎం జగన్ చేశారు. తెలంగాణ, కర్ణాటకలతో పాటు.. ఇతర రాష్ట్రాల్లోని తమకు అనుకూలంగా ఉండే తెలుగు అధికారుల కోసం విజ్ఞప్తులు చేశారు.
కానీ.. ఒకరిద్దర్ని తప్ప.. కేంద్రం ఎవరి డిప్యూటేషన్లకు అంగీకరించలేదు. తెలంగాణ నుంచి రప్పించాలనుకున్న ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్రలకు కూడా కేంద్రం అంగీకారం తెలుపలేదు. అయితే.. ఐఏఎస్‌లకు ఎక్కువ కాలం బాధ్యతలు ఇవ్వకపోయినా సమస్యలు వస్తాయి కాబట్టి.. వారి సీనియార్టీకి తగ్గట్లుగా ఐదు నెలల తర్వాతైనా.. పోస్టింగులు ఇవ్వక తప్పలేదు.