ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు దిగజారిపోతున్నా.. మీడియా విలువలకు పాతరేస్తున్నా.. మీడియా పెద్దల ముసుగులో దేవులపల్లి అమర్, రామచంద్రమూర్తి సమర్థించడంపై.. టీడీపీ నేతలు భిన్నమైన విశ్లేషణ చేస్తున్నారు. వారిద్దరూ తెలంగాణ వారు కాబట్టి.. ఏపీ సర్వనాశనమైనా పర్వాలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండి పడుతున్నారు. ఏపీలో జీవో గురించి తెలంగాణ వాసులు అయిన అమర్, రామచంద్రమూర్తి మాట్లాడటం ఏమిటని టీడీపీ సీనియర్ నేత యనమల ప్రశ్నించారు. ఆంధ్రావాడు కాదు కాబట్టే మీడియాపై విడుదల చేసిన జీవోను అమర్ సమర్ధిస్తున్నారని యనమల మండిపడ్డారు. పాత జీవోనే రాజ్యాంగానికి వ్యతిరేకమని అప్పుడు.. టీడీపీ సహా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు వ్యతిరేకించాయన్నారు.
ప్రజాస్వామ్యవాదులంతా ఏకమై జాతీయస్థాయిలో ప్రతిఘటించారని గుర్తు చేశారు. యనమల వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో… నామినేటెడ్ పదవులు పొంది.. కీలకంగా వ్యవహరిస్తున్న వారిలో అత్యధికులు తెలంగాణవారే. ముఖ్యంగా.. సలహాదారులు.. ఐ అండ్ పీఆర్ విభాగంలోని వారిలో ఎక్కువ మంది తెలంగాణ వారే ఉన్నారు. వీరిలో చాలా మంది.. తెలంగాణ ఉద్యమ సమయంలో.. ఏపీపై అనుచిత వ్యాఖ్యలు చేసినవారే. ఇప్పుడు వారంతా.. ఏపీ ప్రజలు పన్నులుగా కడుతున్న సొమ్ములే రూ. లక్షలకు లక్షలు జీతాలుగా తీసుకుంటూ.. వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సలహాదారులుగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అంటున్నారు.
ఇప్పటికిప్పుడు కాకపోయినా ముందు ముందు.. ఏపీ సర్కార్ లో కీలక బాధ్యతల్లో ఉన్న తెలంగాణ వారెంత మంది అన్నదానిపై.. చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. యనమల దాని కోసం.. ఏ బేస్ సిద్ధం చేశారు. ముందు ముందు.. సందర్భం వచ్చినప్పుడల్లా.. ఏపీ ప్రభుత్వంలో తెలంగాణ వాదం.. హైలెట్ కానుంది.