ఏపీ సర్కార్‌కు ప్రెస్‌కౌన్సిల్ ముందూ లెంపలేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. నిరాధార వార్తలు రాస్తే..కేసులు పెట్టవచ్చంటూ.. జారీ చేసిన జీవో దేశవ్యాప్త కలకలం రేపగా.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా… సుమోటోగా స్పందించింది. తక్షణం .. ఆ జీవోపై వివరణ ఇవ్వాలని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేశారు. ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో వల్ల.. పాత్రికేయ ప్రపంచ నైతిక స్థైర్యం దెబ్బతింటుందని ప్రెస్ కౌన్సిల్ అభిప్రాయపడింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు.. మీడియాకు సంబంధించిన అంశాల్లో కీలకమైన అధికారాలు ఉంటాయి. మీడియా స్వేచ్చను కాపాడే విషయంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
అదే సమయంలో.. మీడియాపై వచ్చే ఆరోపణలపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉంటుంది. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా.. ప్రెస్ కౌన్సిల్ ఆప్ ఇండియా.. సుమోటోగా.. ఈ జీవో అంశాన్ని తీసుకుని వివరణ కోరుతూ.. ఆదేశాలు జారీ చేయడం.. ఆసక్తి కలిగించేదే. జగన్మోహన్ రెడ్డి సర్కార్ జారీ చేసిన జీవో.. దేశవ్యాప్తంగా కలకలం రేపింది. చర్చనీయాంశమయింది. నయా నియంత పోకడలకు నిదర్శనమని.. జాతీయ మీడియా తేల్చింది. ఈ క్రమంలో పీసీఐ స్పందించింది. కొద్ది రోజుల క్రితం.. ఏపీలో టీవీ5, ఏబీఎన్ చానళ్లను నిషేధించిన ఏపీ సర్కార్.. టీడీశాట్ ముందు సమాధానం చెప్పుకోలేకపోయింది. సాంకేతిక కారణాల పేరుతో.. సమర్థించుకునే ప్రయత్నం చేసినా.. టీడీశాట్ కర్ర కాల్చి వాత పెట్టినంత పని చేసింది.
చానళ్లను ప్రసారం చేయాలని తీర్పు ఇస్తూ.. జరిమానా విధించింది. తమ వద్ద డబ్బుల్లేవని.. జరిమానా విధించవద్దని ప్రభుత్వం తరపు న్యాయవాది.. టీడీశాట్‌ను బతిమాలుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు.. జీవోను ఉపసంహరించుకుని.. ప్రెస్ కౌన్సిల్‌కు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు.