ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం ఇంకా బిగుసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన నిర్ణయం ఏంటో స్పష్టంగా చెప్పేశారు. ప్రైవేటీకరణవైపే మొగ్గుచూపుతున్నారన్నది సుస్పష్టం. అయితే, ఇదే సమయంలో దాదాపు 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి ఏంటీ, మరణించిన వారి కుటుంబాల పట్ల కనీస సానుభూతైనా వ్యక్తం చేయలేదు. ఇక, రాజకీయంగా చూసుకుంటే… ఆర్టీసీ కార్మికుల సమస్యను భాజపా సీరియస్ గా తీసుకుని కార్యాచరణకు సిద్ధమైంది. కేంద్రం జోక్యానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది ప్రశ్న?
కేబినెట్ భేటీపై ఎంపీ రేవంత్ రెడ్డి స్పందిస్తూ… కేసీఆర్ తీరులో అడుగడుగునా అహంకారం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు. 16 మంది కార్మికులు చనిపోతే వారిపై కనీస సానుభూతి లేకపోవడం అమానవీయం అని విమర్శించారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారికి ధైర్యం చెప్పే ప్రయత్నమే లేదనీ, ఇకపై తెలంగాణ సమాజం కేసీఆర్ ని భరించలేదన్నారు. బతికితే బతకండీ, లేకపోతే చావండి అన్నట్టుగా నియంతలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారనీ, రాచరికం రోజుల్లో కూడా ఇలాంటి దారుణమైన పరిస్థితులు చూడలేదన్నారు. ఆర్టీసీని కొంతమంది పెద్దలకు అమ్మేయడానికి కేసీఆర్ నిర్ణయించుకుని, నెపాన్ని కార్మికులూ ప్రతిపక్ష పార్టీలపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇలా రేవంత్ తనదైన ధోరణిలో ముఖ్యమంత్రి తీరుపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ విమర్శలు ఓకే… ఇప్పుడు పార్టీపరంగా కాంగ్రెస్ ఏదో ఒకటి చెయ్యాల్సిన అవసరం వారికీ ఉంది. ఎందుకంటే, ఇదే అదనుగా భాజపా చురుగ్గా స్పందిస్తూ… రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయంగా ఉన్నామని నిరూపించుకునేందుకు ఈ సందర్భాన్ని ఒక అవకాశంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది. కరెక్టేగానీ, కాంగ్రెస్ అధికారంలో లేదుకదా ఏం చేస్తుందీ అనిపించొచ్చు! రాష్ట్ర స్థాయిలో కార్మికులకు మద్దతుగా నిలుస్తున్నామనే భరోసా వారికి కలిగేలా కార్యాచరణ ఉండాలి. ప్రస్తుతం అదే పనిచేస్తున్నారు కదా అనిపించొచ్చు. అలా అని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారేమోగానీ, వాస్తవంలో వేరే విధంగా కనిపిస్తోంది. కార్మికులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్నే తీసుకుంటే, అది కేవలం కాంగ్రెస్ కార్యక్రమంగా, రేవంత్ రెడ్డి సెంట్రిక్ గా మాత్రమే జరిగింది. దాన్లో కార్మికుల ఆవేదన హైటైల్ కాలేదు. రాష్ట్రస్థాయిలో కేసీఆర్ సర్కారు మీద ఆర్టీసీ అంశమై కాంగ్రెస్ పార్టీ పెంచిన ఒత్తిడి అంటూ చెప్పుకోవడానికి ఏం కనిపించదు! అంటే, ప్రతిపక్షంగా సమస్యల పట్ల ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే సందర్భం వచ్చినా, కాంగ్రెస్ నిలబడలేకపోయిందనే అభిప్రాయమే కలుగుతోంది.