జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు విశాఖలో చేపట్టిన లాంగ్ మార్చ్ కు భవన నిర్మాణ కార్మికుల తో పాటు లక్షలాదిగా జనాలు హాజరయ్యారు. ఈ వేదిక మీద మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఇసుక సమస్యపై అధికార పార్టీ దుమ్ము దులిపారు. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడటాని కంటే ముందు మాట్లాడిన ఒక భవన నిర్మాణ కార్మికుడి వ్యాఖ్యలు ఆసక్తి గొలిపాయి.
ఆ భవన నిర్మాణ కార్మికుడు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్దికాలానికే ఇసుక సమస్య మొదలైందని, కొద్ది రోజుల్లోనే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే ఆ సమస్య అలాగే కొనసాగింది అని, జీవనోపాధి కోల్పోవడంతో ఎంతో ఒత్తిడికి లోనయ్యామని, అధికారులను , కలెక్టర్‌ను, అన్ని రాజకీయ పార్టీలను తాము కలిశామని, కానీ పవన్‌కళ్యాణ్ ఈ సమస్యపై మాట్లాడితేనే తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అన్న అభిప్రాయం తమ కార్మికులు అందరిలోనూ కలిగిందని ఆ భవన నిర్మాణ కార్మికుడు అన్నారు. గతంలో రాజధాని భూముల విషయంలోనూ, ఇలాంటి మరికొన్ని సమస్యలు విషయంలోనూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాతే సమస్యకు పరిష్కారం జరిగిన విషయం ఆయన గుర్తు చేశారు. అయితే ముందుగా తాము నాదెండ్ల మనోహర్ ని కలిస్తే, కొద్దికాలంపాటు ప్రభుత్వానికి సమయం ఇచ్చే ఉద్దేశంతో తాము ఉన్నామని ఆయన అన్నారని, కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని కలిసి, తమ సమస్య గురించి చెప్పిన తర్వాత, ఆయన ఈరోజు తమ సమస్య మీద గళం విప్పారని ఆయన అన్నారు.
తాము దళిత సామాజిక వర్గానికి చెందిన వారమని, నిజంగా చెప్పాలంటే 2019 ఎన్నికలలో తాము జనసేన పార్టీకి ఓటు వేయలేదని, కానీ ఇవాళ తమ సమస్య మీద ఆయన ప్రభుత్వాన్ని నిలదీసిన విధానం, తమ కోసం ఆయన నిలబడ్డ విధానం చూస్తుంటే, ఆయనకు ఓటు వేయని లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల తరఫున తాను పవన్ కి క్షమాపణ కోరుతున్నా అని ఆయన అన్నారు.