సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు భాజపాలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. సోమవారం నాడు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారనీ, భాజపా కండుకువా కప్పుకుంటారని సన్నిహితులు చెబుతున్నారు. ఆయన టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. నిజానికి, ఆయన టీడీపీలో ఉండగా ఫైర్ బ్రాండ్ అన్నట్టుగా ఉండేవారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగేవారు. అయితే, ఉన్నట్టుండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద విమర్శలు ప్రారంభించారు. అదే సమయంలో వైకాపా నుంచి కూడా ఆయనకి కొంత మద్దతు లభించిందన్నది వాస్తవం! ఆ సమయంలో విజయసాయిరెడ్డి ఆయన ఇంటికి వెళ్లారు కదా. చంద్రబాబును ఓడిస్తా, ఆంధ్రా వచ్చి సభలు పెడతా ప్రచారం చేస్తా అంటూ చాలా మాట్లాడారు.
టీడీపీ బహిష్కరణకు గురయ్యాక అధికార పార్టీ తెరాసలో ఆయన చేరే ప్రయత్నాలు చేశారనే కథనాలూ వచ్చాయి. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనీ, దాంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారనీ అంటారు! ఇప్పుడు భాజపా ఆయన్ని ఆహ్వానించినట్టు సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్వయంగా మోత్కుపల్లిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్లి, కాషాయ కండువా కప్పుకోనున్నారు. మోత్కుపల్లిని చేర్చుకోవడం వల్ల భాజపాకి లాభమేంటంటే… ఒక గట్టి వాయిస్ పార్టీకి తోడైనట్టు అవుతుంది. కేసీఆర్ ని మాంచి వాగ్దాటితో కడిగేయగలరు.
భాజపాలో చేరడం వల్ల మోత్కుపల్లికి రాజకీయ భవిష్యత్తు ఉన్నట్టు అవుతుంది. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం అంటోంది. దాంతో రాష్ట్రంలో ప్రముఖ భాజపా నేతగా గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. ఇదంతా ఓకేగానీ… మోత్కుపల్లి చిరకాల రాజకీయ కల భాజపాలో చేరడం వల్ల నెరవేరుతుందా అనేదే అసలు ప్రశ్న? ఆయనకి టీడీపీ మీద కోపం వచ్చిందే గవర్నర్ పదవికి తన పేరును చంద్రబాబు సిఫార్సు చెయ్యనందుకు, ఆ పదవి దక్కకపోతే కనీసం రాజ్యసభకైనా తనని పంపించనందుకు కదా! పదవి లేదన్నదే ఆయన ఆవేదన. మరి, భాజపాలో చేరాక తన కలల్ని సాకారం చేసుకుంటారా, ఆ పార్టీ నుంచి పదవులకు సంబంధించి ఏదైనా స్పష్టమైన భరోసా లభించిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒకటైతే వాస్తవం… టీడీపీ నుంచి బహిష్కణకు గురయ్యాక, తెరాసలో చేరలేరు. కాంగ్రెస్ లోకి వెళ్లలేరు. రాజకీయ భవిష్యత్తు కావాలనుకుంటే ప్రస్తుతం మాత్రమే భాజపా కనిపిస్తోంది. కాబట్టి, బేరాలాడే పరిస్థితి ఉంటుందా అనేది ప్రశ్న..?