తిరుమలలో మూడు నెలలుగా.. “ఆపరేషన్ దళారి” జరుగుతోంది. ప్రజాప్రతినిధుల పీఆర్వోల ముసుగులో దళారులుగా వ్యవహరిస్తున్న భక్తులకు దర్శనం టిక్కెట్లు అమ్ముతున్న వారిని విజిలెన్స్ అధికారులు పట్టుకుంటున్నారు. దొరికిన వారి దగ్గర్నుంచి వివరాలు తెలుసుకుంటున్న పోలీసులకు మైండ్ బ్లాంక్ అవుతోంది. మూడు నెలలు కాలంలో 300 మంది దళారులను విజిలేన్స్ అధికారులు పట్టుకున్నారు. వీరందరూ ప్రజాప్రతినిధులు, అధికారులు సిఫార్సు లేఖలు పై టిక్కెట్లు పొంది.. బ్లాక్‌లో భక్తులకు విక్రయిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వైసీపీ ప్రజాప్రతినిధి సిఫార్సుపై.. బ్రేక్ దర్శనం టిక్కెట్లు పొందిన దళారి.. ఓక్కో టిక్కెట్‌ను రూ. పాతికవేలకు అమ్ముతూ విజిలెన్స్‌కు పట్టుబడ్డారు. ఆ దళారి చుట్టూ ఓ నెట్ వర్క్ ఉంది. ఇందులో టీటీడీ ఉద్యోగులు కూడా ఉన్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపుగా 46 మంది మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సిఫార్సు లేఖలపై వీరు టిక్కెట్లు పొందారు. తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య సిఫార్సు లేఖపై ఏకంగా 36 సార్లు టిక్కెట్లు పొందారు. అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సిఫార్సు లేఖపై 27 సార్లు, వరంగల్ ఎమ్మెల్యే వినయ భాస్కర్ కోటాలో 17 సార్లు, ఎంపీ దయాకర్ కోటాలో 11 టిక్కెట్లు పొందారు. మంత్రి కేటీఆర్, కేసీఆర్ వ్యక్తిగత ప్రైవేటు కార్యదర్శి సహా పలువురి పేర్లతో టిక్కెట్లు పొందారు. ఒక్క దళారే…. వందల సార్లు ప్రజాప్రతినిధులు,ఉన్నతాధికారుల సిఫార్సు లేఖల పై టిక్కెట్లు పోంది భక్తులకు విక్రయించాడు. మరి వందల్లో ఉన్న మిగతా వారి సంగతేంటి..?
ఎవరైనా వీఐపీ సిఫార్సు లేఖ మీద టిక్కెట్లు జారీ చేస్తే.. ఆ సమాచారం.. సంబంధింత వీఐపీకి వెంటనే చేరిపోతుంది. మరి ఇన్ని సార్లు వాళ్ళకి తెలియకుండా.. దళారులు టిక్కెట్లు తీసుకుంటున్నారా… అన్న అనుమానాలు ప్రధానంగా వస్తున్నాయి. సిఫార్సు లేఖలు ఇస్తున్న ప్రజాప్రతినిధులకు జరుగుతున్న దందా గురించి మొత్తం తెలుసని చెబుతున్నారు. అసలు లోపం ఎక్కడ ఉందో.. తెలుసుకుని.. అక్కడ అడ్డుకట్ట వేయాలి కానీ.. తిరుమల కొండపై తిష్టవేసి.. దళారిగా మారిన వారిని పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. ఈ సిఫార్సు లేఖలపై దర్శనం టిక్కెట్లు ఇవ్వడం నిలిపివేస్తేనే.. సామాన్య భక్తులకు ఊరట లభిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.