కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా తీస్తున్న రామ్ గోపాల్ వర్మ.. సినిమా పబ్లిసిటీ కోసం.. కొత్త పుంతలు తొక్కుతున్నారు. వివాదాలు సృష్టించి.. నెగిటివ్ పబ్లిసిటీ తెచ్చుకోవడంలో ఆర్జీవీ దిట్ట. ఇప్పుడు తన సినిమాకూ అదే పంథాలో వెళ్తున్నారు. అయితే మీడియా పట్టించుకోకపోవడంతో..వ్యక్తుల్ని టార్గెట్ చేశారు. ఇలా ఆయన టార్గెట్ చేసిన వ్యక్తుల్లో గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు కూడా ఉన్నారు. తన సినిమా కోసం.. మొదట జొన్నవిత్తులను ఓ పాట రాయమని.. ఆర్జీవీ ఆడిగారు. అక్కడే పాట విషయంలో ఇరువురి మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయి. జొన్నవిత్తుల పాట రాయలేదు కానీ… ఇద్దరి మధ్య వచ్చిన విబేధాలు మాత్రం పెరిగిపోయాయి.
అంతే.. చాన్స్ దొరికిందని అనుకున్నారేమో కానీ.. ఆర్జీవీ.. జొన్నావిత్తులపై అభ్యంతరకరంగా విరుచుకుపడుతున్నారు. ఆయనను రెచ్చగొడుతున్నారు. ఆ తర్వాత జొన్నవిత్తుల చౌదరి అంటూ.. ఆయనను సంబోధించడం ప్రారంభించారు. ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ వేర్వేరు కులాలు ఆపాదిస్తూ…పేర్లు పెట్టి… పిలవడంతో.. పెద్ద గొడవ జరిగింది. అయితే.. ఈ విషయంలో.. ఆర్జీవీ అన్ని కులాలను అవమానిస్తున్నారన్న ఉద్దేశంతో.. ఆర్జీవీకి కౌంటర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో.. జొన్నవిత్తుల సినిమాను ప్రకటించారు. పప్పు వర్మ అనే సినిమాను తీస్తున్నట్లుగా ప్రకటించారు. దాన్ని ఆర్జీవీ బయోపిక్‌గా.. నిర్మోహమాటంగా చెబుతున్నారు. ఎంత కామెడీగా తీయాలో.. అంత కామెడీగా తీస్తానంటున్నారు.
ఇలాంటి విషయాలను ఆర్జీవీ మరింత చాలా బాగా ఉపయోగించుకుంటారు. ఇటీవలి కాలంలో.. ఆయనను టీవీ చానళ్లు లైట్ తీసుకుంటున్నాయి. ఆయన మార్క్ వివాదాలు బోర్ కొట్టేశాయి. టీఆర్పీలు కూడా రావడం లేదు. కానీ జొన్నవిత్తులతో వివాదం వర్కవుట్ అయినట్లుగా కనిపిస్తోంది. కులం విషయం కావడంతో.. చానళ్లు కూడా.. మొహమాటానికి పోకుండా చర్చలు పెడుతున్నాయి. దాంతో ఆర్జీవీకి మళ్లీ ప్రచారం దొరుకుతోంది.