ఎట్టకేలకు పవన్ కల్యాణ్ మళ్లీ కెమెరా ముందుకు రానున్నాడు. ఒకటి కాదు, ఏకంగా రెండు సినిమాలు ఫిక్సయ్యాయి. ఒకటి `పింక్` రీమేక్ అయితే, రెండోది క్రిష్ సినిమా. పవన్ నుంచి ఒకేసారి రెండు సినిమాలు సిద్ధం అవుతుండడం ఫ్యాన్స్‌ని ఖుషీ చేసే విషయమే. కాకపోతే… ఆ ఇద్దరు దర్శకులే పవన్ ఫ్యాన్స్‌ని తెగ భయపెడుతున్నారు.
క్రిష్ విషయానికొద్దాం. ప్రతిభావంతులైన దర్శకులలో క్రిష్ ఒకడు. తన కథలు, ఆలోచనలు అన్నీ ఉన్నతంగా ఉంటాయి. కథానాయకుడి పాత్ర నుంచి కావల్సిన స్ఫూర్తి దొరుకుతుంది. కానీ ఏం లాభం..? ఆయనకు కమర్షియల్ హిట్ అనేది లేకుండా పోయింది. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది లేదు. గౌతమి పుత్ర శాతకర్ణి మంచి సినిమా అన్నారు. కానీ పెట్టుబడికి మించి రూపాయి కూడా ఎక్కువగా సంపాదించలేదు. ఇక ఎన్టీఆర్ బయోపిక్కులు రెండు భాగాల గురించి అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. రెండూ డిజాస్టర్లే. అలాంటి క్రిష్ పవన్ కి కమర్షియల్ సినిమా ఇవ్వగలడా? అనేది పెద్ద ప్రశ్న. పైగా ఈ సినిమాకి భారీ బడ్జెట్ అవసరం అవుతోంది. దాదాపు 100 కోట్లయినా పెట్టుబడి పెట్టాలి. దాన్ని తిరిగి రాబట్టుకోగలిగేంత సినిమా క్రిష్ తీయగలడా? అనే అనుమానాలు వేధిస్తున్నాయి.
ఇక పింక్ రీమేక్. దీనికి వేణు శ్రీరామ్ దర్శకుడు. వేణు ట్రాక్ రికార్డు చూస్తే.. తప్పకుండా కంగారొస్తుంది. ఎన్నో ఏళ్లుగా దిల్ రాజు కాంపౌండ్‌ని అంటిపెట్టుకున్న దర్శకుడు. తన తొలి సినిమా (ఓ మై ఫ్రెండ్) ఫ్లాప్ అయ్యింది. నానితో సినిమా తీసి ఓ హిట్టు కొట్టాడు గానీ, ఆ క్రెడిట్ తన ఖాతాలోకి వెళ్లలేదు. మరుసటి సినిమాని పట్టాలెక్కించడానికి చాలా సమయమే తీసుకుంటున్నాడు. అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాల్సింది…అది ఆగిపోయింది. ఇలాంటి దర్శకుడు ఇప్పుడు పవన్‌ని హ్యాండిల్ చేయగలడా? అన్నింటికంటే ముఖ్యంగా పింక్ సినిమా కమర్షియల్ సబ్జెక్ట్ కాదు. పవన్ ఫ్యాన్స్ ఊగిపోయే అంశాలేం ఇందులో ఉండవు. పైగా… పవన్‌ది దాదాపు అతిథి పాత్రకిందే లెక్క. కథ ముందే తెలిసిపోయింది కాబట్టి.. పెద్దగా షాకింగ్ విషయాలేం ఈ స్క్రిప్టులో ఉండవు. ఇవన్నీ పింక్ రీమేక్‌కి
ప్రతికూలంగా కనిపించే అంశాలే.
పవన్ ఓ మంచి కమర్షియల్ కథతో ముందుకొస్తే బాగుండేది. చిరు తన రీ ఎంట్రీ విషయంలో అదే చేశాడు గా. ఖైదీ లాంటి మాస్ మసాలా సినిమా ఎంచుకున్నాడు. అందులోనే కాస్త సామాజిక అంశాలు ఉండేలా చూసుకున్నాడు. అన్నింట్లోనూ అన్నని ఫాలో అయ్యే పవన్… ఈ విషయంలో ఆయన్ని ఎందుకు విస్మరించాడో..?