ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభించి నెల దాటేసింది. ఈ నెలలో సమ్మెను విరమింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఎలాంటివో తెలిసిందే. తన నిర్ణయమే ఫైనల్ అన్నట్టుగా మొండి పట్టుదలతో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై కేంద్ర హోం హాఖ మంత్రి అమిత్ షాకి రాష్ట్ర భాజపా నేతలు వివరించారు. కార్మికుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై అమిత్ షాతో అధ్యక్షుడు లక్ష్మణ్, గరికపాటి, వివేక్, మోత్కుపల్లి నర్సింహులు చర్చించారు. ఈ సందర్భంగా అమిత్ షా చెప్పింది ఏంటంటే… ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండాలనీ, వారికి అన్ని రకాలుగా మద్దతు ఇవ్వాలన్నారు! ఉద్యమ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వోద్యోగులుగా పరిగణిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిన అంశాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రైవేటీకరణ పేరుతో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతోపాటు, కార్మికుల ఆత్మహత్యలపై కూడా అమిత్ షాకి వివరాలు ఇచ్చారు.
రాష్ట్ర భాజపా నేతలకు అమిత్ షా ఇచ్చిన మార్గదర్శకాలు చూస్తుంటే… ఇకపై ఆర్టీసీ సమ్మెకు అన్ని రకాలుగా భాజపా మద్దతుగా నిలుస్తుందనే అనిపిస్తోంది. ఇంతవరకూ ప్రెస్ మీట్లు, విమర్శలకు మాత్రమే భాజపా నేతలు పరిమితమౌతూ వచ్చారు. కార్మికుల తరఫున నిరసనల విషయంలో కాంగ్రెస్ పార్టీ వారి సొంత కార్యాచరణతో ముందుకెళ్లింది. ఇకపై భాజపా కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి. రాష్ట్ర నేతలే నేరుగా రంగంలోకి దిగుతారా, ఇతర పార్టీలనూ కలిసొచ్చే సంఘాలనూ కలుపుకుని ఐకమత్యంగా కార్యాచరణ రూపొందిస్తారా అనేది వేచి చూడాలి. ఈనెల 9న భాజపా వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైదరాబాద్ వస్తున్నారు. ఢిల్లీలో అమిత్ షాని కలిసిన మోత్కుపల్లి నర్సింహులు, అధికారికంగా నడ్డా సమక్షంలో 9న పార్టీలో చేరబోతున్నారు. అదే రోజున ఆర్టీసీ కార్మికులతో ఏదైనా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉందని భాజపా వర్గాలు అంటున్నాయి.
రాజకీయంగా చూసుకుంటే సీఎం కేసీఆర్ మీద ఒత్తిడి పెంచేందుకు భాజపాకి ఒక సమస్య దొరికింది! వ్యవహారం అమిత్ షా దాకా వెళ్లింది కాబట్టి, కార్యాచరణ ఉండొచ్చు. వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలంటే.. ఇదో బలమైన ప్రచారాస్త్రంగా భాజపా మార్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఎలాగూ, కాశ్మీరు అంశం, హిందుత్వలను ప్రచారం చేసుకుంటారు. ఇప్పుడీ స్థానిక అంశాన్ని కూడా అనుకూలంగా మార్చుకునేట్టే ఉన్నారు.