ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అవమానరకంగా నిధులు.. విధులు ఉండని పోస్టుకు బదిలీ చేయడమే కాదు.. ఆ తర్వాత కూడా.. ఏపీ సర్కార్ ఆయనను అవమానిస్తూనే ఉంది. జగన్ సర్కార్‌లో నెంబర్ టూగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ… ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని పరిపాలనలో భాగంగానే బదిలీ చేశాం తప్పేమిటని ప్రశ్నించారు. ఇంతటితో ఆగిపోతే సరిపోయేది.. కానీ ఎల్వీ సుబ్రహ్మణ్యం జీతం తగ్గిస్తే తప్పు కానీ.. తాము అలా చేయలేదని గుర్తు చేశారు. ఎల్వీ ఎక్కడ పని చేసినా.. అదే జీతం వస్తుంది కదా.. అని తనకు మాత్రమే సాధ్యమైన లాజిక్ ను వినిపించారు. అప్పటికీ ఎల్వీ సుబ్రహ్మణ్యం జీతం కోసమే సీఎస్‌గా పదవిలో ఉన్నట్లుగా.. ఆయన కక్కుర్తి పరుడన్నట్లుగా.. బొత్స చిత్రీకరిస్తూ వెటకారంగా మాట్లాడటం.. మీడియా ప్రతినిధుల్లోనూ ఆశ్చర్యానికి కారణం అయింది.
ఎల్వీ సుబ్రహ్మణ్యం తొలగింపుపై… ప్రభుత్వం స్పందించాలంటూ.. విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు . ఈ క్రమంలో ప్రభుత్వం తరపున మాట్లాడిన బొత్స సత్యనారాయణ.. అధికారులను అవమానించేలా మాట్లాడటం.. మరో వివాదానికి దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో పని చేస్తున్న అఖిల భారత సర్వీసు ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా ఉంది. ప్రభుత్వ పెద్దల మెప్పు పొందాలంటే.. నిబంధనలు.. పట్టించుకోకుండా.. చెప్పినట్లు చేయాల్సిందే. అలా చేస్తే కేసుల్లో ఇరుక్కుంటామేమో అని ఆందోళన చెందుతున్నారు. అలా చేయకపోతే.. అవమానకరంగా.. గెంటేస్తున్నారు.
అలా చేయడమే కాదు.. మంత్రులతో.. ఇలా జీతాలు తగ్గిస్తామా.. ఏంటీ అంటూ.. వెటకారం కబుర్లు చెప్పిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ… ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం.. సీఎస్ ఎంపిక విషయంలో ప్రభుత్వ వర్గాలు తర్జన భర్జన పడుతున్నాయి. కేంద్ర సర్వీసుల్లో ఉన్న నీలం సాహ్నిని తదుపరి సీఎస్‌గా దాదాపుగా ఖరారైనప్పటికీ.. కేంద్రం ఆమెను రిలీవ్ చేయాల్సి ఉంది. దీని కోసమే ఎదురు చూస్తున్నారు.