ఎంత చెట్టుకి అంత గాలి. ఎంత క్రేజుకి అంత పారితోషికం. ఓ హిట్టు పడిందంటే నిర్మాతలు సూట్ కేసులతో సహా ప్రత్యక్షం అయిపోతారు. ఫ్లాపులొస్తే… వాళ్లంతా గాయబ్. ఓ హిట్టు చూసి పారితోషికం పెంచుకునే హీరోలు సైతం – బ్యాడ్ టైమ్ నడుస్తున్నప్పుడు పారితోషికాల్ని తగ్గించుకుని మరీ నిర్మాతలకు బోలెడన్ని వెసులుబాటులు కల్పిస్తుంటారు. ఇంకొంతమందైతే.. `పారితోషికం తరవాత.. ముందు సినిమా పూర్తి కానివ్వండి` అంటూ బంపర్ ఆఫర్ ఇస్తారు. సినిమా విడుదలయ్యాక లాభాల్లో వాటా తీసుకోవడం ఉభయ శ్రేయస్కరం. ప్రస్తుతం ఇదే బాటలో ముగ్గురు హీరోలున్నారు.
రవితేజ తన డౌన్లో ఉన్నాడు. ఈమధ్య కాలంలో `రాజా ది గ్రేట్` మినహాయిస్తే హిట్టు కొట్టిన దాఖలాలు లేవు. `అమర్ అక్బర్ ఆంటోనీ` అయితే ఆ నష్టాల నుంచి నిర్మాతలు, బయ్యర్లు ఇంకా తేరుకోలేదు. అందుకే రవితేజ కూడా దిగొచ్చాడు. తన కొత్త సినిమా కోసం పారితోషికం తీసుకోవడం లేదు. రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రుతిహాసన్ కథానాయిక. ఈ సినిమా కోసం రవితేజ పారితోషికం తీసుకోలేదు. లాభాల్లో వాటా తీసుకునే షరతు మీదే సినిమా పట్టాలెక్కింది. గోపీచంద్ కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాడు. గోపీచంద్- సంపత్ నంది కాంబినేషన్లో ఓ సినిమా ఇటీవలే క్లాప్ కొట్టుకుంది. దీనికీ గోపీ `జీరో` పారితోషికంతోనే పనిచేస్తున్నాడు. ఎందుకంటే గోపీ టైమ్ అంత ఘోరంగా ఉంది. వరుస వైఫల్యాలు వెంటాడుతున్నాయి. ఇటీవల విడుదలైన చాణక్య కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈలోగా తన చేతిలోని ఓ సినిమా చేజారిపోయింది. ఇలాంటి తరుణంలో గోపీతో సినిమా చేయడానికే నిర్మాతలు భయపడుతున్నారు. అందుకే గోపీచంద్ ఈ ఆఫర్ ఇచ్చాడు. రవితేజ, గోపీచంద్ యాక్షన్ హీరోలు. కాస్త బడ్జెట్‌ని కంట్రోల్ చేసుకుని సినిమాలు తీసుకుంటే, డిజిటల్ రూపంలో మంచి డబ్బులొస్తాయి. ఎందుకంటే హిందీ నాట మన తెలుగు డబ్బింగులకు మంచి గిరాకీ ఉంది. చాణక్య డిజాస్టర్ అయ్యింది గానీ, హిందీ డబ్బింగుల నుంచి మంచి డబ్బులొచ్చాయి. శాటిలైట్‌ని కూడా అమ్ముకోగలిగితే నిర్మాత కొంతలో కొంత సేఫ్ అవుతాడు.
ఇక యువ హీరో రాజ్‌తరుణ్ కూడా ఇదే దారిలో నడుస్తున్నాడు. తనకీ ఫ్లాపులే. హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్లో ఓసినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకీ పారితోషికం లేదు. కేవలం నెలవారీ ఖర్చులు మాత్రమే తీసుకుంటున్నాడట. నిఖిల్ కొత్త సినిమా `కార్తికేయ 2`కి సైతం పారితోషికం లేదు. వీళ్లంతా సినిమా బిజినెస్ పూర్తి చేసుకున్న తరవాత… అప్పుడు నిర్మాతకేమైనా డబ్బులు మిగిలితే, అందులోంచి తమ వాటా తీసుకుంటారంతే. హిట్లు లేని హీరోలకు మళ్లీ అవకాశాలు రావాలంటే ఈ పద్ధతే మేలు. నిర్మాతలకూ కాస్త వెసులు బాటు దొరుకుతుంది.