రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ ప్రకంపనలు ఇంకా ఆగలేదు. అఖిల భారత సర్వీసు అధికారుల్లో సంచలనం రేకెత్తించిన ఈ బదిలీపై విపక్షాల నుంచి విమర్శలు ప్రారంభమవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ప్రయత్నిస్తోంది. ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీపై ఓ సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రకటనలు చేస్తోంది. మద్దతుగా ఉన్న ఓ వర్గం మనోభావాలు దారుణంగా దెబ్బతిన్నాయన్న అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో కూడా ఉంది. అందుకే వారిని బుజ్జగించేందుకు తాయిలాలు సిద్ధం చేస్తున్నారు. ఈ రోజు నీరబ్ కమార్ ఇన్ చార్జ్ సీఎస్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత కొన్ని బదిలీలు జరిగే అవకాశం ఉంది.
ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేయటంతో పాటు అంతకుముందు రోజే ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జేఎస్వీ ప్రసాద్ ను కూడా బదిలీ చేశారు. ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులపై.. ఒకే సారి వేయడంతో.. తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ఐఏఎస్ల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అన్నివైపుల నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు జేఎస్వీ ప్రసాద్ ను టీటీడీ ఈవోగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ ను ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా గానీ .. లేకపోతే.. జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా నియమించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
మరో వైపు ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేసినందుకు కొన్ని క్రైస్తవ సంఘాలు వేడుకలు చేసుకోవటం విస్తృతంగా వైరల్ అయ్యింది. హిందూ ధార్మిక సంస్థలు కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాయి. బ్రహ్మణ సంఘాలు.. ఎల్వీని సాగనంపడంపై.. తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ.. హిందూ వ్యతిరేక నిర్ణయమని మండిపడుతూ ప్రకటనలు చేశాయి. అధికారుల బదిలీతో ఇంత రాజకీయం అవుతుందని.. బ్రాహ్మణ వర్గం ఇంత వ్యతిరేకం అవుతందని ఊహించలేని .. ప్రభుత్వ పెద్దలు… వారికి పదవులు ఇచ్చి సంతృప్తి పరచాలనుకుంటున్నారు.