నమ్మకంతో డిపాజిట్లు కట్టించుకుని జెండా ఎత్తేసిన అగ్రిగోల్డ్ సంస్థ బాధితుల్ని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమయింది. అగ్రిగోల్డ్‌లో రూ.10 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి నేటి నుంచి చెక్కులను పంపిణీ చేయనున్నారు. గుంటూరులో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తొలివిడతలో మొత్తం 3,69,655 మందికి సంబంధించిన డిపాజిట్లు తిరిగి చెల్లించనున్నారు. ఎన్నికల ప్రచారసభల్లో జగన్.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే…రూ.1,150 కోట్లు పంపిణీ చేసి..అందరి బాధలు తీరుస్తామని ప్రకటించారు. అన్నట్లుగానే మొదటి బడ్జెట్లోనే వారికి రూ.1,150 కోట్లు కేటాయించారు. ముందుగా రూ.10 వేలలోపు డిపాజిట్ చేసిన బాధితులకు చెల్లించేందుకు గతనెల 18న రూ.267 కోట్లను విడుదల చేసింది. రూ.20 వేలలోపు వున్న మరో 4 లక్షల మంది డిపాజిటర్లకు కూడా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఓ ప్రైవేటు కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చెల్లించిన దాఖలాలు ఎక్కడా లేవు. తొలి సారి ఏపీ సర్కారే… ఈ పని చేస్తోంది. అగ్రిగోల్డ్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడం.. బాధితులు పెద్ద ఎత్తున ఉండటంతో.. ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా.. వారిని ఆదుకోవడానికి ప్రజాధనం వెచ్చిస్తామని.. పార్టీలు హామీ ఇచ్చాయి. గత టీడీపీ సర్కార్.. ఆత్మహత్య చేసుకున్న అగ్రిగోల్డ్ ఏజెంట్లకు రూ. ఐదు లక్షల చొప్పున నష్టపరిహారం పంపిణీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ..పదివేల లోపు డిపాజిట్లు సేకరించిన వారికి రూ. 300 కోట్లు విడుదల చేసింది. అప్పట్నుంచే ఈ ప్రక్రియ సాగుతోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల తర్వాత రూ. 270కోట్లు విడుదల చేసి.. వారికి చెక్కలిస్తోంది. మరో తొమ్మిది వందల కోట్లను.. మరో నెల రోజుల్లో విడుదల చేయాల్సి ఉంది.
అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి.. ప్రభుత్వం ఆ నిధులను మళ్లీ తీసుకోనుంది. ఇప్పటికి ఈ విషయం కోర్టులో ఉంది. అయితే.. ఆస్తుల వేలం విషయంలో అనేక ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. వేలం వేస్తున్నా… కొంత మంది కొనుగోలుకు ముందుకు రాలేదు.అతి కష్టం మీద.. కొన్ని ఆస్తులను వేలం వేసి..రూ. 50కోట్లను సమీకరించారు. మిగతా ఆస్తులను వేలం వేయాల్సి ఉంది.