త్రివిక్రమ్.. ఓ బ్రాండ్.
త్రివిక్రమ్… ఓ ఆలోచన.
త్రివిక్రమ్.. ఓ ఆరాధన.
చిత్రసీమ చాలామంది రైటర్లని చూసింది. అందులో మహామహులున్నారు. ప్రేక్షకుల్ని థియేటర్లలోంచి తెరలోకి గుంజేసిన వాళ్లున్నారు. తమ మాటలతో.. పదాల గారడీతో మత్తులా ఆవహించినవాళ్లున్నారు. వాళ్లందరిలో త్రివిక్రమ్ ప్రత్యేకం.
పింగళి, ఆత్రేయ, జంథ్యాల.. ఈ తరం అయిపోయాక
పరుచూరి బ్రదర్స్ మెత్తపడ్డాక
రచయితకు గౌరవం తగ్గిందన్న ఫీలింగ్ వచ్చేశాక..
పెన్ను పట్టుకుని ప్రక్షాళనకు దిగాడు త్రివిక్రమ్. అతనొచ్చాకే మళ్లీ మాటకు గౌరవం పెరిగింది. రేటొచ్చింది.
స్వయంవరం, నువ్వేకావాలి, చిరునవ్వుతో… ఇలా సినిమా సినిమాకీ త్రివిక్రమ్ చెలరేగిపోతూ వచ్చాడు. మాటల్ని ఇలా వాడుకోవచ్చా? అనే రీతిలో – చెలరేగిపోయాడు. త్రివిక్రమ్ లో గొప్పదనం ఏమిటంటే… క్లుప్తత. ఛమక్కు. అంతకు ముందు తరాన్ని, వాళ్లలోని గొప్ప లక్షణాల్నీ బాగా అవపోసన పట్టేశాడు. త్రివిక్రమ్ లో ఓ పింగళి ఉంటాడు.
త్రివిక్రమ్‌లో ఓ ఆత్రేయ ఉంటాడు
త్రివిక్రమ్ ఓ జంథ్యాల, ఓ ముళ్లపూడి వెంకటరమణ.. ఇలా హేమా హేమీలంతా ఉంటారు. వాళ్లని వీలున్నప్పుడల్లా, అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటాడు త్రివిక్రమ్. బాగా చదువుకుని ఉండడం వల్ల, గ్రంధాలన్నీ కంఠతా చేయడం వల్ల – ఎప్పుడు ఎక్కడ ఎలాంటి మాట వాడాలో బాగా తెలుసుకున్నాడు. త్రివిక్రమ్ ఎప్పుడూ – చిన్న చిన్న విషయాల చుట్టూనే తిరుగుతుంటాడు. స్వయంవరం, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే నువ్వే… ఇవన్నీ ఒకలాంటి కథలే. అందులోనే ఎంతో చెప్పాడు.
త్రివిక్రమ్‌ని కాపీ రైటర్ అన్నారు.
హాలీవుడ్ సినిమాల నుంచి సీన్లు, కథలు ఎత్తేస్తాడన్నారు.
అ.ఆ చూశాక.. మూల రచయిత్రికి క్రెడిట్ ఇవ్వలేదని గొడవ చేశారు.
అయినా త్రివిక్రమ్ స్టార్‌డమ్, క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ సినిమాల్లో వాడిన మంచి డైలాగులు కోట్ చేయాలంటే త్రివిక్రమ్‌నే గుర్తు చేసుకోవాలి. ఆమధ్య త్రివిక్రమ్ ఫామ్ కోల్పోయి ఉండొచ్చు. పంచ్‌లపై ధ్యాస పెంచి, మూలాల్నీ, ఫీలింగ్స్‌నీ, ఎమోషన్స్‌నీ సరిగా ఆవిష్కరించలేకపోవొచ్చు. కానీ.. ఇప్పటికీ తనలో పదును ఉందని `అరవింద సమేత` లాంటి చిత్రాలు రుజువు చేస్తుంటాయి.
రామ్ గోపాల్ వర్మని చూసి దర్శకులు అవ్వాలని సినిమా రంగంలోకి అడుగుపెట్టే కుర్రాళ్ల సంఖ్య పెరిగింది. ఇప్పటికీ ఉంది.
త్రివిక్రమ్ ని చూసి, రాతలు నచ్చి, రచనా వ్యాసంగంపై ఇష్టం పెంచుకుంటున్న కుర్రాళ్లు.. ఇప్పటికీ హైదరాబాద్ బస్ ఎక్కుతూనే ఉంటారు. రచయితలుగా చలామణీ అవుతున్న చాలామందికి స్ఫూర్తి కూడా ఆయనే. త్రివిక్రమ్‌ని తిట్టుకున్నా, మెచ్చుకున్నా.. తను అంత త్వరగా వదిలిపోయే రకం కాదు. ఎందుకంటే… త్రివిక్రమ్ ఓ మత్తుమందు.
(ఈరోజు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా)