ఏపీలో తెలుగు మీడియం ఎత్తేసి..ఇంగ్లిష్ మీడియం మాత్రమే.. ఉంచాలనుకున్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని… అధికార భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సమర్థించారు. అల్పాదాయ, మధ్య ఆదాయ వర్గాల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం పెట్టాలని జగన్ పాదయాత్రలో చెప్పారు, ప్రజాభీష్టానికి అనుగుణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందని.. చెప్పుకొచ్చారు. అయితే.. ఏపీలో అన్ని పాఠశాలల్లో ఒకటో తరగతి నుండి పదో తరగతి తెలుగును తప్పనిసరి చేస్తూ జీవో ఉందని ఏపీలో ప్రాథమిక విద్యలో తెలుగు వినిపిస్తుంది, కనిపిస్తుందని ప్రభుత్వాన్ని సమర్థించారు.
ఇదే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్… చంద్రబాబు హయాంలో.. పూర్తి స్థాయిలో కాకుండా.. కేవలం అర్బన్ ప్రాంతాల్లో అదీ కూడా…ఇంగ్లిష్ మీడియంలో చదవాలనుకునే ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశ పెడితే.. చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చంద్రబాబు తెలుగును చంపేస్తున్నాడని… వారానికో సారి ప్రెస్ మీట్ పెట్టి విమర్శించేవారు. అయితే.. అప్పుడు ఆయనకు… మధ్య, అల్పాదాయ వర్గాల పిల్లలు గుర్తుకు రాలేదు. ఎందుకంటే.. ఆయనకు చంద్రబాబు ఎలాంటి పదవి ఇవ్వలేదని… ఇప్పుడు.. జగన్మోహన్ రెడ్డి పిలిచి మరీ.. రెండు పదవులు.. ఒకటి తెలుగు.. మరొకటి హిందీ పదవులు ఇచ్చేసరికి… తెలుగు ఏమైపోయినా.. పర్వాలేదన్నట్లుగా.. సమర్థిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
అచ్చంగా.. మీడియాలో దశాబ్దాలుగా పని చేసి.. చివరికి.. మీడియాకు సంకెళ్లు వేసే జీవోకు మద్దతు పలికిన … ప్రసిద్ధ జర్నలిస్టుల తీరు మాదిరిగానే… యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ స్పందన ఉందంటున్నారు. వారికీ పదవులు వచ్చాయి కాబట్టి… తమ పాత విధానానికి రివర్స్ అయ్యారు. ఇప్పుడు యార్లగడ్డకు ఒకటికి రెండు పదవులు వచ్చాయి కాబట్టి.. రివర్స్ అయ్యారంటున్నారు. అందరిదీ… రాజకీయ ఆరాటమే కానీ.. తాము ఇప్పటి వరకూ ప్రవచించిన సిద్ధాంతాలకు కట్టుబడే పెద్దలు కనిపించడం లేదనే విమర్శలు ఇలాంటి వారిని చూసినప్పుడు సహజంగానే వస్తూంటాయి.