వ్యక్తిగత హాజరు మినహాయింపు తర్వాత తొలి శుక్రవారం వచ్చేస్తోంది. జగన్ కోర్టుకు హాజరవుతున్నారా.. అంటే… లేదని.. వైసీపీ వర్గాలు.. ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ఆరు నెలలుగా చేస్తున్నట్లుగానే ఈసారి కూడా అబ్సెంట్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో కోర్టు మెట్లెక్కితే.. నామోషీ అవుతుందని.. ఏపీ ప్రతిష్టను దెబ్బతీసిన వారవుతారని.. జాతీయ స్థాయిలో… ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రచారం జరుగుతుందన్న భయం వైసీపీ నేతల్లో ఉంది. అందుకే… అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నాననే పిటిషన్ వేయించే అవకాశం కనిపిస్తోంది..!
సీబీఐ కోర్టు జగన్ పిటిషన్ ను కొట్టి వేస్తూ.. హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఇవ్వలేదు. నేరుగా..సుప్రీంకోర్టుకే వెళ్లాలని సూచించింది. సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై… జగన్ తరపు న్యాయవాదులు పరిశీలన చేస్తున్నారు. వైఎస్ జగన్ సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక మినహయింపు ఇస్తే సాక్షులు ప్రభావితం అవుతున్నారన్న విషయాన్ని సీబీఐ నొక్కిచెప్పడం… చట్టం ముందు అందరూ సమానమేనని వాదించడంతో…సీబీఐ కోర్టు సమర్థించింది. దీంతో సుప్రీంకోర్టు విబేధించే అవకాశం కూడా లేదంటున్నారు. పైగా జగన్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. ఈ కారణంగా… పైకోర్టుకు వెళ్లే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ కొట్టి వేసిన తర్వాత కూడా జగన్ కోర్టుకు హాజరు కాకపోతే.. కోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం. ఒక వేళ.. సీరియస్ అయి బెయిల్ రద్దు పిటిషన్ వేయాలని సీబీఐకి సూచిస్తే.. మొదటికే మోసం వస్తుందని… జగన్ వర్గీయుల్లో ఉంది. అయితే.. కోర్టు ఆబ్సెంట్ పిటిషన్ కు అంగీకరించకపోతే.. వారెంట్ జారీ చేస్తుంది కానీ.. తీవ్ర నిర్ణయాలు తీసుకోదని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే… వారెంట్ జారీ చేసినా.. జగన్ కు ఇబ్బందే. దాన్ని చూపి.. బెయిల్ రద్దు పిటిషన్ ను.. సీబీఐ దాఖలు చేస్తే.. డిఫెండ్ చేసుకోవడం.. జగన్ కు కష్టమవుతుంది.