స్పీకర్ అంటే.. రాజకీయాల్లో “అసెంబ్లీ స్పీకర్” అనే పదవికి ఫిక్సయిపోయింది. స్పీకర్ పదవికి ఓ గౌరవం ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా ఉండాలి. పార్టీల జెండాలను కూడా.. మెడలో వేసుకోరు. ఇప్పటి వరకూ.. ఆ సంప్రదాయాలు కొనసాగాయి. కానీ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్పీకర్.. తమ్మినేని స్పీకర్… అందరిలాంటి స్పీకర్ కాదు..అలాంటి.. ఇలాంటి “స్పీకర్” కూడా కానే కాదు.! అందుకే తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ” చంద్రబాబును ప్రజల మధ్య నిల్చోబెట్టి గుడ్డలూడదీస్తాం, ఓ పెద్ద పుస్తకం అంత అనుభవం ఎందుకు?..మడిచి ఎక్కడో పెట్టుకోమనండి..” ఇలాంటి సంప్రదాయమైన భాష ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం గారిదే.
ఆయనను పూర్వాశ్రమంలో చంద్రబాబు ప్రోత్సహించి ఉండవచ్చు గాక.. ఇప్పుడు.. వైసీపీలో ఉన్నారు. స్పీకర్ గా ఉన్నారు. ప్రసంగాల విషయంలో స్పీకర్‌గా ఆయనకు మంచి పేరుంది. అందుకే… తన స్పీకింగ్ టాలెంట్‌గా… తరచూ చూపిస్తున్నారు. అగ్రిగోల్డ్ ఖాతాదారులకు రూ. పదివేల చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమంలో… చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. హాయ్‌ల్యాండ్ భూముల్ని కొట్టేసేందుకు.. చంద్రబాబు, లోకేష్ ప్లాన్ వేశారని ఆరోపించారు. అగ్రిగోల్డ్‌తో సంబంధం లేదని చంద్రబాబు ప్రకటించగలరా అని సవాల్ చేశారు. స్పీకర్ హోదాలో.. తాను ఇలా స్పీచ్ ఇస్తే… విమర్శలు వస్తాయని ఆయనకు తెలిసినట్లుగా ఉంది.. దానికి కూడా.. తన “స్పీక్స్”లోనే క్లారిటీ ఇచ్చారు.
కళ్ల ముందు అన్యాయం జరిగితే స్పీకర్ స్పందించకూడదా అని సమర్థించుకున్నారు. నేను ముందు ఎమ్మెల్యేని, తర్వాతే స్పీకర్‌నని చెప్పుకున్నారు. స్పీకర్ వ్యాఖ్యలపై.. టీడీపీ అదే తరహాలో కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్య విలువలను పతనం చేయడంలో.. వైసీపీలో అందరూ తలా ఓ చేయి వేస్తున్నారని మండిపడింది. తమ్మినేనికి అంతగా.. రాజకీయం చేయాలని ఉంటే.. స్పీకర్ పదవికి రాజీనామా చేసి.. వైసీపీ అధికారప్రతినిధిగా చేరాలని సలహా ఇచ్చింది. మొత్తానికి ఏపీ స్పీకర్.. కొత్త సంప్రదాయాలను నెలకొల్పుతున్నట్లుగానే ఉందన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.