రాష్ట్రంలో 5100 రూట్లలో ప్రైవేటు బస్సుల్ని నడిపేందుకు అనుగుణంగా కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఒకేసారి అన్నీ కాకుండా, దశలవారీగా కొన్నికొన్ని ప్రైవేటు బస్సుల్ని దించాలని ప్రభుత్వం చర్చిస్తున్న తరుణంలో… హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రవేటు బస్సుల ప్రవేశంపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రైవేటీకరణ అంశమై సోమవారం వరకూ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని ఆదేశించింది. దీంతో ప్రైవేటు బస్సుల ప్రవేశానికి తాత్కాలికంగా బ్రేకులు పడ్డట్టయింది. అంతేకాదు, రూట్లను ప్రైవేటీకరిస్తూ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని తమకు సమర్పించాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. ఆ కాపీ తమ దగ్గర లేదని ప్రభుత్వం తరఫున వాదిస్తే, దాన్లో ఏమైనా రహస్య సమాచారం ఉందనుకుంటే షీల్డు కవర్లో పెట్టి సమర్పించాలని చెప్పింది. ఆర్టీసీలో రూట్ల ప్రైవేటీకరణ చెయ్యకూడదంటూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
మీడియాతో పిటీషనర్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ… రూట్లను ప్రైవేటీకరించే అధికారం ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఏపీఎస్ ఆర్టీసీగానీ, తెలంగాణ ఆర్టీసీగానీ ఏదైనా రిజెల్యూష్ పాస్ చేసిందా అనీ, రెండు రాష్ట్రాల ఆర్టీసీలకి కలిపి ఒక బోర్డు ఉండాలి అది ఉందా అని ప్రశ్నించారు. ఇంతవరకూ ఏపీఎస్ ఆర్టీసీ విభజన కాలేదనీ, కాబట్టి తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకున్నా, దానికి మంత్రి మండలి ఆమోదం లభించినా అది చట్టప్రకారం చెల్లుబాటు కాదన్నారు. ఇది ఆర్టీసీ చట్టానికి విరుద్ధమన్నారు. సోమవారం వరకూ ప్రైవేటీకరణ అంశమై తదుపరి చర్యలు వద్దంటూ కోర్టు తాజా ఆదేశాలపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కార్మికులవైపు ఉందంటూ కమ్యూనిష్టు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ప్రైవేటీకరణ అంశమై తదుపరి విచారణను సోమవారానికి కోర్టు వాయిదా వేసింది.
ప్రైవేటు బస్సుల విషయమై చకచకా నిర్ణయాలు తీసుకోవాలనే వేగంతో దూసుకెళ్తున్న కేసీఆర్ సర్కారుకి కోర్టు బ్రేకులు వేసిందనే అనాలి. ఇప్పటికే ప్రభుత్వ వాదనలపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తోంది. ఆర్టీసీ ఎండీ సమర్పించిన నివేదిక తప్పుల తడక అంటూ ఆ మధ్య మండిపడింది. ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాల్సింది ఎంత, ఆర్టీసీకి రావాల్సిందెంత, జీహెచ్ ఎంసీ ఎందుకు డబ్బులిచ్చిందీ అనే లెక్కలు చెప్పడంలో ప్రభుత్వం తడబడింది. ఇప్పుడు, మంత్రి మండలి తీసుకున్న నిర్ణయంపైనే కోర్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి!