రేపు (9న) హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో మిలియన్ మార్చ్ చేపట్టాలని ఆర్టీసీ జేయేసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీల నుంచి కూడా ట్యాంక్ బండ్ ముట్టడికి మద్దతు ఉంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బయల్దేరి వెళ్లాలంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్ననే కాంగ్రెస్ శ్రేణులకు పిలుపిచ్చారు. భాజపా కూడా అదే బాటలో కార్యకర్తల్ని పంపించే ఏర్పాట్లలో ఉంది. ఈ నేపథ్యంలో రేపు ట్యాంక్ బండ్ ముట్టడికి అనుమతులు లేవంటూ పోలీసులు తేల్చి చెప్పడం విశేషం! శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతి కావాలంటూ కమిషనర్ అంజనీ కుమార్ ని జేయేసీ నేతలు కలిశారు. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా అనుమతివ్వలేమని ఆయన చెప్పేశారు.
శుక్రవారం ఉదయం నుంచే జిల్లాల్లో ముందస్తుగా అరెస్టులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ కి బయల్దేరుతున్న సంఘాల నేతలు, పార్టీల కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే, ఎలాగైనా ఈ మిలియన్ మార్చ్ ని జయప్రదం చేసి తీరాలంటూ, శుక్రవారం మధ్యాహ్నం జేయేసీ నేతలు హైదరాబాద్ లో ఒక రహస్య ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. అరెస్టులు, ప్రభుత్వం నుంచి అనుమతుల నిరాకరణ నేపథ్యంలో ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీల మద్దతు ఉంది కాబట్టి, వివిధ మార్గాల ద్వారా రేపటికి కార్యకర్తలు హైదరాబాద్ చేరుకుంటారని జేయేసీ నేతలు అంటున్నారు. అనుమతుల నిరాకరణ నేపథ్యంలో సీపీఐ నేత చాడా వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… కార్మికుల సమ్మెను ప్రభుత్వం పట్టించుకోలేదనీ, ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కుల్ని కూడా హరిస్తోందనీ, ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ కార్యక్రమం ముందుకు సాగుతుందన్నారు.
రూట్ల ప్రైవేటీకరణ అంశమై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద హైకోర్టు స్టే విధించడంతో కార్మిక సంఘాలకు కొంత ఉత్సాహం పెరిగినట్టయింది. దీంతో రేపటి నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటుందనే అనిపిస్తోంది. అందుకే, ముందస్తు అరెస్టులు ప్రారంభమయ్యాయి. అప్పట్లో రాష్ట్రం కోసం ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చ్ జరిగింది, ఇప్పుడు అదే రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిన సీఎం కేసీఆర్ నిర్ణయాలకు నిరసనగా మార్చ్ కి రంగం సిద్ధమౌతోంది. అధికార పార్టీపరంగా చూసుకుంటే… ఈ నిరసనను సక్సెస్ కానీయకుండా శతవిధాలుగా ప్రయత్నాలు జరుగుతాయనడంలో సందేహం లేదు. మరి, ఈ సందర్భంలో ప్రతిపక్షాల వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.