ఐదేళ్లలో ఏపీలో పెట్రోలియం రంగంలో రెండు లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని.. కేంద్ర మంత్రి ధర్మేంధ్ర సీఎం జగన్ కు హామీ ఇచ్చారు. కడప జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న స్టీల్ ప్లాంటుకు ఇనుప ఖనిజం సరఫరా చేయడానికి.. కూడా కేంద్ర మంత్రి అంగీకరించారు. అమరావతి వచ్చిన కేంద్రమంత్రి… జగన్‌తో విందు సమావేశంలో పాల్గొన్నారు. పునర్వివిభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంది. దీని కోసం ప్రపంచంలోని ప్రఖ్యాత ఉక్కు కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని జగన్ కేంద్ర మంత్రికి వివరించారు. ప్లాంటు నిర్వహణలో స్థిరత్వం సాధించడానికి నిరంతరాయంగా ఇనుప ఖనిజాన్ని సరఫరా చేయాలని కోరారు. దీనికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే దీనిపై ఎంఓయూ కుదర్చుకోవాలని నిర్ణయించారు.
వచ్చే ఐదేళ్లలో పెట్రోలు, సహజవాయువు, ఉక్కు రంగాలకు సంబంధించి దాదాపు 2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు ఏపీకి రానున్నట్టు కేంద్రమంత్రి తెలిపారు. విశాఖలో విస్తరణ ప్రాజెక్టుల ద్వారా, కాకినాడలో పెట్రోకాంప్లెక్స్ ఏర్పాటు ద్వారా, కడపలో స్టీల్ ప్లాంట్ రూపంలో భారీగా పెట్టుబడులు వస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వివిభజన చట్టం ప్రకారం క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను తప్పనిసరిగా ఏర్పాటుచేయాల్సి ఉందని.. కాకినాడలో ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసింది. కేంద్ర పెట్రోలియం అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో అత్యున్నత స్థాయి సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు
చమురు, గ్యాస్ వెలికి తీస్తున్న కంపెనీలు చెల్లిస్తున్న రాయల్టీలో రాష్ట్రానికి వాటా ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. దేశానికి తూర్పు తీరంలో ఉన్న ఏపీలో పెట్రో రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ముందుకు వస్తున్నాయని ప్రధాని జగన్‌కు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఉదారంగా ఉండాలని .. జగన్ .. కేంద్రమంత్రిని కోరారు. ఇటీవలి కాలంలో ఓ కేంద్రమంత్రి ఏపీకి వచ్చి సానుకూల ప్రకటనలు చేయడం ఇదే మొదటి సారి. కేంద్రంతో దూరం పెరిగిందన్న ప్రచారాన్ని దీని ద్వారా ఏపీ సర్కార్ తోసిపుచ్చినట్లయింది.