గవర్నర్ కి ఉండే అధికారాలు నామ మాత్రమే కావచ్చు కానీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయనకు విశేష అధికారాలు ఉంటాయి. అందులో ఒకటి, ఎన్నికల ఫలితాల అనంతరం ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాని సందర్భాలలో ఏ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి అన్నది పూర్తిగా గవర్నర్ యొక్క విచక్షణాధికారం మీద ఆధార పడి ఉంటుంది. ఆ సందర్భాలలో ఆయన తీసుకునే నిర్ణయాన్ని సుప్రీంకోర్టుతో సహా ఎవరూ ప్రశ్నించజాలరు. అయితే కేంద్ర ప్రభుత్వం చేత నియమింపబడే గవర్నర్, పలు మార్లు కేంద్రంలో అధికారం లో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తాడు అన్న ముద్ర ప్రజలలో బలంగా ఏర్పడింది. ఇప్పుడు మహా రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో కూడా గవర్నర్ పాత్ర మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది.
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది:
అక్టోబర్లో జరిగిన ఎన్నికలలో, పోటీ జరిగిన 288 స్థానాల్లో, బీజేపీ 105 స్థానాల్లో గెలిస్తే, శివసేన 56 స్థానాల్లో గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ 145 కంటే, ఈ రెండు పార్టీల కూటమి సాధించిన సీట్ల సంఖ్య ఎక్కువే. అయితే కాంగ్రెస్ 44 సీట్లు, చెందిన ఎన్సిపి 54 సీట్లు గెలిచుకున్నాయి. శివసేన పార్టీ ముఖ్య మంత్రి సీటు మీద పీట ముడి వేయడంతో బీజేపీ – శివసేన పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి వీలు కుదరలేదు. మరొక పక్క శివసేన యూపీఏ తో కలిస్తే, మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. అయితే అటు బీజేపీ తరపున మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్, బీజేపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన కు ఇష్టం లేదు అంటూ ఉద్ధవ్ థాకరే మీద తీవ్ర విమర్శలు చేస్తే, ఉద్దవ్ థాకరే ప్రెస్మీట్లోనే, బీజేపీ మీద విమర్శలు గుప్పిస్తూ ఉద్వేగంగా మాట్లాడారు.
ప్రేక్షక పాత్ర పోషిస్తున్న గవర్నర్:
మహా రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్, బీజేపీ నాయకుడు. ఉత్తరాఖండ్ లో బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. జాతీయ స్థాయిలో కూడా బీజేపీ పార్టీకి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చి ఇన్ని రోజులు అయినప్పటికీ ఆయన ఏ నిర్ణయం తీసుకోకుండా రాజకీయ పార్టీలు వాటంతటవే ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చే వరకు వేచి చూడడం విమర్శలకు తావిస్తోంది. శరత్ పవార్ కూడా గవర్నర్ నిర్ణయాన్ని తప్పు బడుతూ ఇవాళ వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ శివసేన పార్టీ మంకు పట్టు వీడకపోతే, గవర్నర్ ఎంత కాలం వేచి చూస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తారా ?
గవర్నర్ గా ఆయన తనకున్న పరిధిలో, అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీ ని కానీ, బీజేపీ – శివసేన కూటమి నుంచి కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించి ఉండాల్సిందని అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఆ ఆహ్వానం తర్వాత రాజకీయ పక్షాలు ఏ విధంగా స్పందిస్తారో అన్నది వేరే విషయం. ఆ ప్రభుత్వం ఎంత కాలం నిలపడుతుందనేది కూడా వేరే విషయం. ఇప్పుడు గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండడం చూస్తుంటే, రాజకీయ పక్షాలు నిర్ణయం తీసుకోలేక పోయాయని కారణం చెప్పి రాష్ట్రపతి పాలన విధించమని కేంద్రానికి గవర్నర్ సిఫారసు చేస్తారేమో అన్న అనుమానాలు ప్రజలలో అసహనానికి గురి చేస్తున్నాయి.
మొత్తం మీద:
ఇటీవలి కాలంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇటు వంటి ఫలితాలు వచ్చిన ప్రతి సారి గవర్నర్ పాత్ర విమర్శల పాలవుతోంది. రాజ్యాంగ బద్ధమైన పదవి లో ఉన్న గవర్నర్, ఇటువంటి సందర్భాలలో, పార్టీలకు అతీతంగా, క్రియాశీలక పాత్ర పోషిస్తే నే తప్ప ప్రజలు వేసిన ఓట్లకు, ప్రజాస్వామ్యానికి విలువ ఉండదు. ఏ సాకు అయినా చెప్పి గవర్నర్, మహారాష్ట్ర లో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తే, అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుంది.