స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి.. భారత్‌ను కశ్మీర్ సమస్య వెంటాడింది. ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేత నిర్ణయం ద్వారా.. ఆ సమస్యకు పరిష్కారం చూపారు… నరేంద్రమోడీ, అమిత్ షా. అయోధ్య సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం చూపబోతోంది. దశాబ్దాలుగా.. దేశాన్ని రెండు వర్గాల మధ్య విభజించిన సమస్య అయోధ్య. దీనిపై.. సుప్రీంకోర్టు చెప్పే తీర్పు అందర్నీ కలుపుతుందని దేశం నమ్ముతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలో ఒక భూభాగం కేంద్ర బిందువుగా ఉన్న వివాదానికి సంబంధించిన కేసు ఇది. రాముడి జన్మస్థలంగా హిందువులు పరిగణించే స్థలంతో పాటు.. బాబ్రీ మసీదు కూడా ఉన్న స్థలం ఇది. హిందూ ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారన్న ప్రధాన ఆరోపణతో ఈ వివాదం మొదలైంది.
16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాట్ బాబర్ ఒక మసీదును నిర్మించాడు. అక్కడున్న హిందూ ఆలయాన్ని పడగొట్టి మసీదు నిర్మించారని హిందువుల వాదన. 1949లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్పటి వరకు తాము మాత్రమే ప్రార్థనలు చేశామని, ఆ ఏడాది రాత్రి వేళ కొందరు హిందువులు గుట్టు చప్పుడు కాకుండా రాముడి విగ్రహాలు తెచ్చి పెట్టారని ముస్లింల ఆరోపణ. అప్పటి నుంచి హిందూ విగ్రహాలకు కూడా పూజలు జరుగుతున్నాయని వారు తెలిపారు. అప్పటి నుంచి హిందూ, ముస్లింల మధ్య కోర్టు కేసులు ప్రారంభమయ్యాయి. 1993 ఏప్రిల్ 3న వివాదాస్పద స్థలాన్ని స్వాధీనం చేసుకుంటూ కేంద్రం చట్టం చేసింది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ పలువురు కోర్టుకెక్కారు. 1994 అక్టోబరు 24న సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. మసీదు ఇస్లాంలో భాగం కాదని పేర్కొంది. స్వాధీనం చేసుకున్న స్థలంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించకూడదని 2003 మార్చి 13న సుప్రీం కోర్టు ఆదేశించింది.
2017 మార్చి 21 సుప్రీం కోర్టు ఒక ప్రతిపాదన చేసింది. కోర్టు వెలుపల ఏకాభిప్రాయంతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. 2019 జనవరి 8న ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. మధ్యవర్తిత్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అక్టోబరు 16న విచారణ రాజ్యాంగ ధర్మాసనం విచారణ ముగించింది. అయోధ్య తీర్పు.. ఉత్కంఠ రెకేత్తిస్తోంది. దేశంలో అత్యంత సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు.. దేశ ప్రజలను.. మెప్పిస్తుందని.. బాబ్రీ మసీదు కూల్చివేతతో ప్రారంభమైన ఓ రకమైన ఉద్రిక్తతను..మళ్లీ తగ్గిస్తుందని.. జనం నమ్ముతున్నారు.