గత ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులుగా ఉన్న రమణదీక్షితులు.. చెన్నై వెళ్లారు. ఇంగ్లిష్, హిందీ, తమిళ మీడియాను పిలిచి… టీటీడీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పింక్ డైమాండ్ దేశం దాటిపోయిందని.. శ్రీవారి పోటులో తవ్వకాలు జరిగాయని.. శ్రీవారి పూజా కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదని వాటి సారాంశం. ఈ ఆరోపణలను ఆధారంగా చేసుకుని వైసీపీ నేతలు… అధికార పార్టీగా ఉన్న టీడీపీపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఇంట్లో తవ్వితే శ్రీవారి నగలన్నీ బయట పడతాయని ఆరోపించారు. శ్రీవారి ప్రతిష్టకే దెబ్బ పడుతూండటంతో.. తప్పుడు ఆరోపణలు చేసిన… రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిలపై చెరో వంద కోట్లకు పరువు నష్టం దాఖలు చేసింది టీటీడీ.
ఏడాదిన్నర గడిచేసరికి.. తిరుమలలో అన్నీ మారిపోయాయి. గతంలో.. పింక్ డైమండ్ మాయమయిందని.. పోటులో తవ్వకాలు జరిగాయని ఆరోపించిన పార్టీనే ఆధికారంలోకి వచ్చింది. కానీ తమ ఆరోపణలు నిజం కాదని… వారే అంగీకరించారు. పింక్ డైమండ్ అనేదే లేదని.. విస్పష్టంగా ప్రకటించారు. పోటులో తవ్వకాలు అనేది అసాధ్యమని కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక పూజా కైంకర్యాలు వేటిలోనూ లోటు లేదని.. కూడా తెలిపోయింది. అంటే.. ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి.. తిరుమల శ్రీవారి చుట్టూ వివాదాలు నడిపారని… నేరుగా క్లారిటీ ఇచ్చేసినట్లయింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఇంకా విశేషం ఏమిటంటే… గతంలో శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీశారంటూ.. విజయసాయిరెడ్డి, రమణదీక్షితులపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించడం.
శ్రీవారి ఆలయం కేంద్రంగా… దేవదేవుని ప్రతిష్టనే పణంగా పెట్టి… రమణదీక్షితులు, విజయసాయిరెడ్డి తప్పుడు ఆరోపణలు స్పష్టమయింది. శ్రీవారినే అప్రతిష్ట పాలు చేయాలనుకున్న విషయంపై క్లారిటీ వచ్చింది. ఇంత చేసిన తర్వాత వారిని కోర్టులో… దోషులుగా నిర్ధారించడానికి కావాల్సినంత సాక్ష్యాలు దొరికినట్లే. కానీ.. అనూహ్యంగా.. టీటీడీ కేసులు ఉపసంహరించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. అంటే.. తాము ఏ శ్రీవారి సేవకు ఉన్నామో.. ఆ శ్రీవారిని అవమానించిన వారి అడుగులకు ఎందుకు మడుగులు ఒత్తాలనుకుంటోంది. ఇలా అయితే.. ఎవరైనా.. శ్రీవారి ప్రతిష్టను మంటగలపడానికి సిద్ధపడిపోరా..? భక్తుల మనోభావాలు ఎవరికీ పట్టవా..?