ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెరాస ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ ఓ లేఖ రాశారు! అవునా… ఏం రాసి ఉంటారూ అనే ఆసక్తి కలగడం సహజం. ఎందుకంటే, ఇప్పుడు డీఎస్ మీద సీఎం కేసీఆర్ వైఖరి ఎలా ఉందో తెలిసిందే. ఆ మధ్య ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ తెరాస నేతలే ముఖ్యమంత్రికి లేఖలు రాసిన పరిస్థితి. అప్పట్నుంచీ డీఎస్ తెరాసలో ఉన్నారా లేరా అనే అనుమానం ఎప్పటికప్పుడు కలుగుతూనే ఉంది. మరోపక్క, ఆయన కుమారుడు అరవింద్ భాజపా ఎంపీగా కేసీఆర్ మీద ఛాన్స్ దొరికితే విమర్శలతో విరుచుకుపడుతున్న పరిస్థితి! ఇలాంటి నేపథ్యంలో సీఎంకి డీఎస్ లేఖ రాస్తే ఎలా ఉంటుంది..? అలానే ఉంది..!
ఆర్టీసీ సమ్మెపై స్పందించిన డీఎస్… నెలరోజులుగా కార్మికులు చేస్తున్న సమ్మె రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తలపిస్తోందనీ, కార్మికుల ఐక్యత చూస్తుంటే దశాబ్దాలుగా తెలంగాణ మట్టిలో ఉన్న ధైర్యం పరిమళిస్తున్నట్టుగా ఉందన్నారు! అంటే… అధికార పార్టీ నేతగా సమ్మెను సమర్థిస్తున్నట్టుగానే ఈ వ్యాఖ్య ఉంది కదా! కార్మికుల మెడలు మీద కత్తి పెట్టినా ఒక్క శాతం కార్మికులు కూడా తలవంచలేదనీ, వారి ధైర్యంలో తెలంగాణ శౌర్యం కనిపిస్తోందన్నారు. అంటే… ప్రభుత్వం వారిని ఏం చెయ్యలేదని చెప్పినట్టే కదా! విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ విభజన కాలేదనీ, సంస్థలో కేంద్రానికీ వాటా ఉందనీ, కేంద్రం ప్రమేయం లేకుండా సంస్థను ప్రైవేటీకరించడం సరికాదని కేసీఆర్ కి తెలియంది కాదన్నారు. అంటే… ఇంత తెలివి తక్కువగా ఎలా వ్యవహరిస్తున్నారు అర్థం వచ్చేలా చెప్పినట్టు ఉంది కదా!
కార్మికుల పట్ల కేసీఆర్ కి ఉన్న సహజ వైఖరి భిన్నంగా ఆయన స్పందిస్తున్నారంటే, ఎవరో కుట్ర చేసినట్టు తనకు అనుమానం కలుగుతోందనీ, తెలంగాణ బిడ్డలు ఎవ్వరికీ తలవంచరని కేసీఆర్ కీ తెలుసనీ, కార్మికుల ఆత్మహత్యలకు కారణమైనవారిపై గుండె రగిలిపోతోందని డీఎస్ అన్నారు. ఇవన్నీ ప్రస్థావిస్తూ కార్మికులకు న్యాయం జరిగేలా వెంటనే స్పందించాలనీ, చర్చలు జరపాలని లేఖలో సీఎంని ఆయన కోరారు. ఈ లేఖలో కేసీఆర్ ని మెచ్చుకుంటున్నట్టుగానే తీవ్రంగా విమర్శించేశారు డీఎస్! ఎప్పట్నుంచో గూడుగట్టుకుని ఉన్న కోపాన్ని, అవకాశం వచ్చినప్పుడు తేనెపూసిన కత్తి అంటారే… అలా సుతిమెత్తగా ఓ పద్ధతి ప్రకారం ఒక సీనియర్ నేత వ్యక్తీకరిస్తే ఎలా ఉంటుందో డీఎస్ లేఖ అలానే ఉంది. ఈ అవకాశాన్ని డీఎస్ సద్వినియోగం చేసుకున్నారనే అనొచ్చు. ఈ లేఖలో కేసీఆర్ విమర్శలే ఉన్నాయి, క్రమశిక్షణా రాహిత్యం అనే ఛాన్స్ సొంత పార్టీవారికి డీఎస్ ఎక్కడా ఇవ్వకపోవడమే చాతుర్యం!