దశాబ్దాలుగా దేశంలో రాజకీయ వివాదాలకు కారణంగా.. హిందూ- ముస్లింల మధ్య ఐక్యతకు విఘాతంగా మారిన అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. అయోధ్య వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగిస్తూ… చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని, అప్పటి వరకు ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని సుప్రీంకోర్టు ఆదేసించింది. ఈ క్రమంలో అయోధ్య యాక్ట్ కింద ట్రస్ట్ మూడు నెలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలని సూచించింది. స్థలాన్ని సున్నీ బోర్డుకు ఇవ్వాలని ఆదేశించింది.
భూ కేటాయింపునకు కేంద్రం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. షియా వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. యాజమాన్య హక్కులు కోరుతూ షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. వివాదాస్పద భూభాగాన్ని అలహాబాద్ హైకోర్టు విభజించడం ఆమోదం కాదని సుప్రీం స్పష్టం చేసింది. మసీదు కూల్చివేత చట్టవిరుద్ధమని తేల్చారు. దశాబ్దాలుగా… ఉన్న అయోధ్య సమస్య.. అంతకంతకూ పీటముడి పడింది. కోర్టులు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమయ్యాయి. అయితే.. సుప్రీంకోర్టు మాత్రం.. ఈ విషయంలో.. అన్ని వర్గాలనూ న్యాయం చేసే ప్రయత్నం చేసింది. రామాలయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా..అయోధ్యలోనే.. మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాలు కేటాయించాలని ఆదేశించింది. దీంతో.. అన్ని వర్గాలు సంతృప్తి పడే అవకాశం కనిపిస్తోంది.
అయోధ్య తీర్పు అత్యంత సున్నితం కావడంతో.. దేశవ్యాప్తంగా… సుప్రీంకోర్టు తీర్పుపై.. ఎలాంటి పుకార్లు ప్రచారం చేయకుండా.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాకు సైతం పోలీసులు ప్రత్యేకమైన ఆంక్షలు పెట్టారు. సున్నితమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.