పోలీసులు లంచాలు తీసుకుని.. ఇసుక లారీలను రాష్ట్రం దాటిస్తున్నారు…అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ నేరుగా ఎస్పీపైనే విరుచుకుపడటం.. కలకలం రేపుతోంది. గత ఐదు నెలలుగా ఏపీలో అవసరాలకు తగ్గట్లుగా ఇసుక దొరకడం లేదని… ఆరోపణలు వస్తున్నాయి. కూలీలు ఉపాధి కోల్పోయారు. దానికి వరదలను కారణంగా.. ప్రభుత్వం చెబుతూ వస్తోంది. కానీ.. ఇతర రాష్ట్రాలకు మాత్రం.. ఏపీ నుంచి సరఫరా అవుతోందన్న ఆరోపణలు గట్టిగానే వస్తున్నాయి. ఇప్పటి వరకూ.. వీటిని నమ్మడానికి సర్కార్ పెద్దలు ఇష్టపడలేదు. తొలి సారి మంత్రి బొత్స సత్యనారాయణ బయటపడ్డారు.
ఇసుక రీచ్‌లో అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయని.. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు.. చూసీచూడనట్లుగా ఉన్నారన్నది టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. పోలీసుల గురించి ఉద్దేశపూర్వకంగా బొత్స అలాంటి వ్యాఖ్యలు చేయరు.. చేయలేరు.. ఎందుకంటే.. ఆయన ప్రతిపక్షంలో లేరు. అధికారపక్షంలో ఉన్నారు. ఏం జరిగినా బాధ్యత వహించాల్సింది అధికారపక్షమే. ఇసుక మాఫియా ఉందని.. అంగీకరించక తప్పని పరిస్థితుల్లో.. ఆ నెపాన్ని పోలీసులపై నెట్టేందుకు.. ప్రభుత్వం సిద్ధపడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పోలీసులు వైసీపీ నేతల అదుపాజ్ఞల్లో పనిచేస్తూ.. వారి రాజకీయ అవసరాలకు అనుగుణంగా పని చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూంటే… వారు మాత్రం ఖండించారు. మీసాలు మెలేసి.. తొడలు కొట్టి సవాళ్లు చేశారు. ఇప్పుడు స్వయంగా.. ప్రభుత్వంలో ఉన్న మంత్రే… పోలీసులపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులనే నిందితులుగా మారుస్తున్నారు. దీనిపై.. వారు నోరు మెదపలేరు. విపక్షంపై… దూకుడు చూపిస్తే.. పాలకులు సంతోషిస్తారు కానీ.. పాలుకులపైనే తొడకొడితే.. ఉద్యోగాలకు ఎసరొస్తుంది. అందుకే స్వయంగా ప్రభుత్వమే నిందలేసినా.. భరించక తప్పని పరిస్థితి వారిది.