సరిలేరు నీకెవ్వరులో ప్రత్యేక గీతాల హంగామా ఎక్కువగానే కనిపించబోతోంది. ఇప్పటికే తమన్నా ఓ ప్రత్యేక గీతంలో నటించడానికి ఓకే చెప్పింది. త్వరలోనే ఈ పాటని తెరకెక్కిస్తారు. ఇందులో మరో స్పెషల్ సాంగ్ కూడా ఉంది. ఆ పాటలోనూ ఓ ప్రముఖ కథానాయిక కనిపిస్తుందని సమాచారం. అయితే ఈ పాటకు సంబంధించిన విషయాన్ని చిత్రబృందం గోప్యంగా ఉంచాలనుకుంటోంది. `మహర్షి` సినిమాకీ దేవిశ్రీనే సంగీతం అందించాడు. అయితే.. అందులో మాస్‌కి నచ్చే బాణీలు సరిగా కుదర్లేదు. ఐటెమ్ పాటకి అస్సలు ఛాన్సే లేకుండా పోయింది. అందుకే ఈసారి ఆ బాకీ వడ్డీతో సహా తీర్చుకోవాలనుకున్నాడో ఏమో.. రెండు ఐటెమ్ గీతాల్ని కంపోజ్ చేసి పెట్టాడు. దేవి ఐటెమ్ పాటల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. అయితే `జిగేల్ రాణీ` తరవాత దేవి ఐటెమ్ పాటేదీ పేలలేదు. మహేష్ చిత్రాలకు దేవిశ్రీ సంగీతం అందించినప్పటికీ అందులో ఐటెమ్ గీతాలకు ఛాన్సు రాలేదు. అందుకే ఈసారి కసిగా ఐటెమ్ పాటని కంపోజ్ చేసినట్టు తెలుస్తోంది. దేవిశ్రీ కంపోజ్ చేసే ఐటెమ్ గీతాల్లో హుక్ లైన్ బాగా పేలుతుంది. ఈసారి కూడా మంచి ట్రెండీ హుక్ లైన్ పట్టుకున్నాడని – ఈ పాట మాస్‌ని ఒక ఊపు ఊపేస్తుందని టాక్. మరి ఈ పాటలో కనిపించే కథానాయిక ఎవరో చూడాలి.