ఎప్పుడో, ప్రత్యేక రాష్ట్ర సాధన సమయంలో హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ ఉద్రిక్తమైన రోజులు చూశాం. ముళ్ల కంచెలు, వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్, లాఠీ ఛార్జ్… తెలంగాణ ఏర్పాటు కోసం, ఆంధ్రా నుంచి విడిపోవడం కోసం జరిగిన పోరాట సమయంలో ఇవన్నీ కనిపించాయి! మళ్లీ ఇప్పుడు, సాధించుకున్న రాష్ట్రంలో… ఆ సాధనలో కీలక పాత్ర పోషించిన నాయకులు పాలకులుగా మారిన ఇప్పటి సొంత రాష్ట్రంలో… అప్పటి పరిస్థితిని తలపించే దృశ్యాలు ఇవాళ్ల చోటు చేసుకున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె 36 రోజులకు చేరుకుంది. కేసీఆర్ సర్కారు మొండి వైఖరికి నిరసనగా ఆర్టీసీ జేయేసీ ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి అనుమతుల్లేవని పోలీసులు అడ్డుచెప్పారు. అయినాసరే, నిరసన తెలిపేందుకు పెద్ద సంఖ్యలో కార్మికులు, పార్టీల కార్యకర్తలు హైదరాబాద్ కి తరలి వచ్చారు.
ఓరకంగా ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని తెరాస సర్కారే సక్సెస్ చేసిందని చెప్పాలి! రెండు రోజుల ముందు నుంచే జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు, మద్దతుదారులు, పార్టీల కార్యకర్తల్ని అరెస్టు చేసి హడావుడి సృష్టించారు. ఇవాళ్ల ట్యాంక్ బండ్ ని పోలీసుల గుప్పిట్లో పెట్టుకుని… నిరసన తెలపడానికి వచ్చినవారిపై లాఠీ ఛార్జ్ చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ ప్రాంతంలో కూడా నాటి ఉద్యమ కాలం రోజులు తలపించే విధంగా పోలీసు పహారా! నిజానికి, ఛలో ట్యాంక్ బండ్ కి అనుమతి ఇచ్చి ఉంటే ఏమయ్యేది… మహా అయితే ఓ నిరసన కార్యక్రమం జరుపుకునేవారు. సాయంత్రం నాలుగు గంటలతో అది ముగిసిపోయేది. గతవారంలో సరూర్ నగర్ లో నిరసన సభ కూడా అలానే జరిగింది కదా? కానీ, దీన్ని అణిచేద్దాం అనే ఉద్దేశంతో అధికార పార్టీ వ్యవహరించడమే ఇప్పుడు ఈ మార్చ్ మళ్లీ చర్చనీయం అవుతోంది.
ఇక్కడ మరో కీలక అంశం కూడా చర్చించుకోవాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇప్పుడు నాయకులుగా మంత్రులుగా చలామణి అవుతున్న ఉద్యమ నేతలు ఏమన్నారూ… సొంత రాష్ట్రం వస్తే, సమస్యలే ఉండవ్, నిరసనలే ఉండవ్, ఆంధ్రా పాలకులు పోతే చాలు అన్నారు. రాష్ట్రం వచ్చింది. ఉద్యమంలో పాల్గొన్నవారు చాలామంది ఇప్పుడు అధికార పదవుల్లోకి వచ్చేశారు! అయినాసరే, మళ్లీ ట్యాంక్ బండ్ మీద తెలంగాణ బిడ్డలు ఎందుకు గళమెత్తాల్సి వచ్చింది..? ఎందుకు సొంతవారిపై లాఠీ ఛార్జ్ లు చేసి, నిరసన తెలిపేందుకు ఉన్న హక్కుల్ని హరించే పరిస్థితి వచ్చింది..? ఆంధ్రా పాలకులు పోతే సమస్యలన్నీ పోతాయని చెప్పినవారు, ఇప్పుడు పదవుల్లోకి వచ్చేసరికి… ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు…? ఇవాళ్ల రోడ్డు ఎక్కిందీ, ఆవేదనను తెలపుతున్నదీ తెలంగాణ బిడ్డలే కదా…. గతంలో వారందరి తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు సొంతవారికి మద్దతుగా నిలవలేకపోతున్నారు..?
ఛలో ట్యాంక్ బండ్… ఇది ఇవాళ్ల ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమమే కావొచ్చు. కానీ, స్థూలంగా ఈ నిరసన ఓ సందేశాన్ని ఇస్తోందని విశ్లేషించుకోవచ్చు. రాష్ట్రాలు అనేవి భౌగోళిక సరిహద్దులు మాత్రమే. అవి సమస్యల్ని తీర్చలేవు. అన్నిటికీ ఒకే పరిష్కారం కాదు! ప్రజల సమస్యలు తీరాలంటే పాలకుల్లో నిబద్ధత ఉండాలి, అంతే!