పాతికేళ్లుగా హైదరాబాద్‌లో చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా 1979నుంచి ప్రతి రెండేళ్లకోసారి అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్ని నిర్వహిస్తోంది. ఒక్కోసారి ఒక్కో నగరాన్ని ఎంచుకుంటారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు తెచ్చే ఉద్దేశంతో చంద్రబాబు హయాంలో… హైదరాబాద్‌ను శాశ్వత వేదికగా మార్చారు. అప్పటినుంచి రెండేళ్లకోసారి హైదరాబాద్‌లో ఈ వేడుక జరుగుతూ వస్తోంది. ప్రపంచ ప్రసిద్ధ సినీ టెక్నిషియన్లు హాజరువుతూ ఉంటారు. అంతర్జాతీయ మీడియాలోనూ.. ఈ వేడుకకు మంచి కవరేజీ వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015, 2017ల్లో చిత్రోత్సవాలు జరిగాయి.
ఈ ఏడాది మాత్రం జరగడం లేదు. తమకు ఆర్థిక స్థోమత లేదని ప్రభుత్వం తేల్చేయడంతో… చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా వేరే నగరాన్ని ఎంపిక చేసుకుంది. మన దేశంలో కమర్షియల్ సినిమాలే ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ.. ఇతర దేశాల్లో చిన్నారుల సినిమాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. చదువులు, ఆటలు, పాటల మధ్య పిల్లల కోసమే రూపొందించిన దేశదేశాల సినిమాల్ని ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగాప్రదర్శించేవారు. ఆ సమయంలో.. హైదరాబాద్‌లో ఉన్న స్కూళ్లన్ని.. విద్యార్థులకు.. ముఖ్యమైన సినిమాలు చూపించేవారు. పిల్లల మానసిక స్థితిని మరింత విశాలం చేసే దిశగా.. ఈ సినిమాలు ఉంటాయి. విద్యా, సాహితీ, కళా రంగాల్లో వికాసమే బాలల వ్యక్తిత్వ నిర్మాణంలో ఉపయోగపడుతుంది. కానీ.. ఎన్ని ప్రయోజనాలున్నా… ప్రభుత్వ నిర్ణయం ముందు.. అన్నీ తేలిపోయాయి.
ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహణకు మొత్తం.. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కొంత భాగం… కేంద్రం వాటా ఉంటుంది. అయితే.. ఈ ఉత్సవాలు నిర్వహించడానికి ఆ మాత్రం ఖర్చును కూడా పెట్టుకోవడానికి తెలంగాణ సర్కార్ సిద్ధపడలేదు. ఆర్థికంగా మరీ అంతగా కుంగిపోయారా.. అన్న అనుమానం కలిగేలా… హైదరాబాద్‌కు ఓ గొప్ప ఈవెంట్‌ను దూరం చేశారు.