కోర్టు ఏం చెప్తోంది, చట్టాలేం చెబుతున్నాయి… అరె, ఇవి కాదురా బయ్, కోర్టు చెప్పిందాన్లో మన వాదనకు అనుకూలంగా ఉన్న లూప్ హోల్స్ ఉన్నాయా లేవా చూడాలి! ఉన్న చట్టంలో మనం చేయాలనుకుంటున్న దానికి సరిపోయే సబ్ సెక్షన్లు ఉన్నాయా చూడాలి! ప్రగతి భవన్లో అధికారులు ఇప్పుడు ఇలాంటి పని మీదే ఉన్నారని అనిపిస్తోంది. వీళ్లతో ఈ పని ఎవరు చేయిస్తారు… ఇంకెవరు, సాక్షాత్తూ ఆయనే! కోర్టులో ఆర్టీసీ కార్మికుల కేసు విచారణ జరగ్గానే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తోపాటు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అవుతుంటారు. నిన్న, ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమం తరువాత కూడా అదే తరహా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రధానాంశం ఏంటంటే… కార్మికులను చర్చలకు పిల్వాల్నా వద్దా?
ఈ టాపిక్ మీద కేసీఆర్ స్పందిస్తూ… కార్మికులతో చర్చలు జరపాలంటూ గతంలో కోర్టు యాజమాన్యానికి సూచించిందనీ, చివరిసారి విచారణలో చర్చలపై అలాంటి ఆదేశాలేవీ లేవు కదా అన్నారట! చర్చలకు సంబంధించి సోమవారం నాడు కోర్టు ఏదైనా మార్గదర్శకత్వం ఇస్తే అప్పుడు చూద్దామని అధికారులతో సీఎం చెప్పినట్టు సమాచారం. 5,100 ప్రైవేటు బస్సులకు అనుమతి ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే, దానిపై స్టే విధిస్తూ… ఆ నిర్ణయం కాపీని తమకు అందించాలని న్యాయస్థానం ఆదేశించిన సంగతీ తెలిసిందే! అయితే, మంత్రి మండలి ప్రొసీడింగ్స్ ని కోర్టు అడిగితే ఇవ్వాల్నా, ఒకవేళ ఇవ్వకపోతే ఏమైతది? అసలు చట్టం ఏం చెప్తోందో స్టడీ చేయండి అంటూ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారని సమాచారం. కేబినెట్ ప్రొసీడింగ్స్ తమకు ఇవ్వాలంటూ కోర్టుకు అడిగే అధికారం ఉందా లేదా అనేది చూడాలన్నారట. కేంద్రం చేసిన చట్టం ప్రకారమే ప్రైవేటు బస్సులకు అనుమతి ఇచ్చామని వాదించాలంటూ అధికారులకు కేసీఆర్ చెప్పారు!
తమ వాదన నెగ్గించుకునేందుకు అవకాశం ఉన్న లొసుగుల్ని వెతకడమే ముఖ్యమంత్రి పనిలా కనిపిస్తోంది! కార్మికులతో చర్చలకు వెళ్లాలని చివరిగా విచారణలో చెప్పలేదు కదా అంటే… చర్చించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏమైనట్టు..? ప్రైవేటుపరం చేస్తూ మంత్రి మండలి నిర్ణయం కాపీని అడిగితే, కోర్టు అలా అడగొచ్చా అనే చర్చ ఎందుకు? ఇక్కడ సమస్య అది కాదు కదా! ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆపాలి, ప్రజా రవాణా పునరుద్ధరించాలి. ఆ దిశగా ఏం చెయ్యాలో ఆలోచించడం మానేసి… అధికారుల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని ఇలాంటి చర్చలు పెట్టుకుంటే ఏం లాభం?