ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం రద్దుచేస్తూ కేవలం ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఏం చేస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ, ” తెలుగు మాధ్యమాన్ని పాఠశాలలలో ప్రభుత్వం ఆపివెయ్యడానికి సన్నాహాలు చేస్తుంటే , ఆంధ్రప్రదేశ్ అధికారభాష సంఘం ఏం చేస్తుంది?” అని ప్రశ్నించారు.
అయితే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం నాయకులు ప్రస్తుతం వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి మడుగులు ఒత్తుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, తెలుగు భాష అమలు మీద ప్రగల్భాలు పలికిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తరఫున జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ మాట్లాడుతున్నాడు. పైగా ఇది చాలా మంచి నిర్ణయం అని పొగుడుతున్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసేవారికి ఎలాగైతే జరిమానాలు విధిస్తున్నారో, అదే విధంగా తెలుగు భాషను సరిగ్గా అమలు చేయని వారి మీద కూడా అలాంటి జరిమానాలు విధించాలని పెద్ద పెద్ద డిమాండ్లను చేసిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఇప్పుడు జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టడానికి ఏ మాత్రం ధైర్యం చేయకుండా, జగన్ అడుగులకు మడుగులొత్తుతూ ఉండడం మనం చేసుకున్న దౌర్భాగ్యం అని తెలుగు భాష అభిమానులు అంటున్నారు.
ఏది ఏమైనా, తమిళనాడులో తమిళ మీడియంలో చదువుతూ పెద్ద పెద్ద కంపెనీలకు సీఈవోలుగా, పెద్ద పెద్ద బ్యూరోక్రాట్లు గా ఉన్నవారు ఉన్నారు. తెలుగు మీడియం చదువుకుని కూడా అత్యంత ఉన్నత స్థానాలు అధిరోహించిన వారు ఉన్నారు. కానీ జగన్ ప్రభుత్వం ఒక డొంకతిరుగుడు వాదన చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం, తెలుగు భాషను భవిష్యత్తులో భూస్థాపితం చేసే అవకాశం ఉంది.