వైసీపీ గెలిచిన కొత్తలో.. ఒంగోలులో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన ఓ బాలికను చెరబట్టిన యువకుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పుడు అది సంచలనం అయింది. వెంటనే..సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీ వారైనా సరే.. కఠిన చర్యలు తీసుకోవాలని.. మళ్లీ అలాంటి ఘటనలు జరగకూడదని.. ఆదేశించారు.
ఆ తర్వాత దాచేపల్లిలో.. ఓ ముస్లిం బాలికపై.. నరేంద్ర రెడ్డి అనే యువకుడు.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారంపై ముస్లిం సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధర్నాలు ఆందోళనలు చేశాయి. అప్పుడు కూడా.. ముఖ్యమంత్రి స్పందించారు. ఏ పార్టీ వారైనా సరే.. కఠిన చర్యలు తీసుకోవాలని.. మళ్లీ అలాంటి ఘటనలు జరగకూడదని.. ఆదేశించారు.
రెండు రోజుల కిందట.. చిత్తూరు జిల్లాలో ఓ పిసిపాపను.. దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసేశారు. మళ్లీ సీఎం స్పందించారు. ఏ పార్టీ వారైనా సరే.. కఠిన చర్యలు తీసుకోవాలని.. మళ్లీ అలాంటి ఘటనలు జరగకూడదని.. ఆదేశించారు.
గత ఐదు నెలల కాలంలో.. ఇలాంటి ఘటనలు.. తరచూ జరుగుతున్నాయి. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డిపద్మ.. బాధితుల పరామర్శ కోసం.. జిల్లాలు పట్టుకుని తిరుగుతున్నారు. పదుల సంఖ్యలో.. మహిళలపై దాడులు, ఆకృత్యాల కేసులు నమోదయ్యాయి. కానీ.. ఎవరిపైన కూడా.. కఠినమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దాచేపల్లిలో ముస్లింబాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి.. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అనుచరుడు. ఆయనను.. పోలీసులు అరెస్ట్ చేశారో లేదో కూడా ఎవరికీ తెలియదు. అంత సీక్రెట్‌గా నిందితుడ్ని ఎందుకు ఉంచుతున్నారని.. టీడీపీ మహిళా నేతలు.. దాచేపల్లి వెళ్లి ధర్నా చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ముస్లిం సంఘాలు రెండు రోజుల పాటు.. రోడ్లను దిగ్బంధించినా పట్టించుకున్నవారు లేరు.
ఇలాంటి కేసుల్లో పోలీసుల వ్యవహారశైలే.. వివాదాస్పదంగా మారుతోంది. నిందితులు … రాజకీయ పార్టీల నేతల్ని ఆశ్రయించడం.. వారు.. పోలీసులపై ఒత్తిడి తెస్తూండటంతో… ఎక్కడిక్కడ బాధితుల్ని… బాధితులుగానే మిగిల్చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతలపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడంలో చూపే ఉత్సాహం.. నిజంగా… ఇలా చిన్నారులపై ఆకృత్యాలకు పాల్పడేవారిని అరెస్ట్ చేయడంలో కానీ.. శిక్షించడంలో కానీ చూపించడం లేదు. ఫలితంగా… నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మళ్లీ అలాంటివి జరగకూడదని సీఎం ఆదేశిస్తూనే ఉంటారు. అవి జరుగుతూనే ఉన్నాయి.