టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంకా తన పదవికి రాజీనామా లేఖను స్పీకర్ కు పంపలేదు. వైసీపీ నుంచి ఇంకా సిగ్నల్స్ రాకపోవడమే దీనికికారణం. దీపావళికి ముందు రోజు.. జగన్ ను కలిసి.. వైసీపీలో చేరేందుకు సంసిద్ధత తెలిపారు. ఆ రోజే.. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. తెలుగుదేశంకు వాట్సాప్లో పంపిన లేఖ మినహా … నేరుగా ఎలాంటి లేఖలు పంపలేదు. వంశీ వైసీపీలో చేరాలంటే తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా వైసీపీలో చేరితే అనర్హత వేటు పడుతుంది.
ప్రస్తుతానికి వైసీపీ అవకాశం కోసం సైలెంట్ గా ఎదురుచూస్తోంది. వంశీ రాజీనామా వ్యవహారాన్ని అవసరమైనప్పుడు వినియోగించుకునేలా వ్యూహం రూపొందిస్తోంది. వేరే పార్టీలో చేరితేనే ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అందుకే వంశీ తెలుగుదేశంకు రాజీనామా చేసి శాసనసభలో తటస్థ సభ్యుడిగా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం వంశీపై వేటు వేస్తుందేమోనని వైసీపీ చూస్తోంది. కానీ.. వంశీపై టీడీపీ వేటు వేసే అవకాశం లేదు. అలాంటి అవకాశం వంశీకి ఇవ్వాలని టీడీపీ అనుకోవడం లేదు. అందుకే కొడాలి నాని, పేర్ని నానిలు వంశీతో నాలుగైదు సార్లు భేటీ అయి.. తదుపరి వ్యూహంపై చర్చించరు.
వంశీ.. సీఎం జగన్ ను కలిసొచ్చిన తర్వాత గన్నవరం నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు అక్కడి పార్టీ ఇన్ చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు వద్దకు పెద్ద ఎత్తున వచ్చాయి. వెంకట్రావు కూడా సీఎం జగన్ ను కలుస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికే వెంకట్రావుకు హైకమాండ్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ.. ఆందోళన చెందాల్సిన పని లేదని.. చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి వంశీని త్రిశంకుస్వర్గంలోనే నిలిపేశారు జగన్.. ఈ కారణంగా తటస్థ ఎమ్మెల్యేగా కొనసాగక తప్పదు.