ఎనిమిది సార్లు వరదలు వచ్చినా.. ప్రాజెక్టులను ఎందుకు నింపలేదని…ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల కిందట.. జలవనరుల శాఖ అధికారుల్ని ప్రశ్నించారు. వారు ఏం చెప్పారో కానీ.. ఇప్పుడు మాత్రం సాక్షి పత్రిక.. ఓ సమాధానాన్ని కనిపెట్టింది. వరదలు వచ్చినా.. ప్రాజెక్టుల్లోకి నీళ్లు వెళ్లకపోవడానికి.. నేరుగా సముద్రం బాట పట్టడానికి కారణం.. చంద్రబాబుట. ఈ విషయాన్ని కనిపెట్టి.. సాక్షి పత్రికలో..ఓ పెద్ద కథనం రాశారు. చంద్రబాబు ఎలా కారణం అంటే..ఆయన హయాంలో కాల్వలు వెడల్పు చేయలేదట. అలా చేసి ఉంటే… ఆ కాల్వల ద్వారా వరద నీటిని తరలించి… పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేసి.. రైతులకు అందించే అవకాశం ఉండేదట. కాల్వలు చంద్రబాబు వెడల్పు చేయకపోవడం వల్ల.. ఇప్పుడు వరద సముద్రంలోకి వెళ్లిపోయిందని .. జగన్ మీడియా చెబుతోంది.
రాయలసీమకు, కృష్ణాడెల్టాకు అవసరమైన నీటిని ప్రభుత్వం సరఫరా చేయడానికి ఇబ్బందిపడే పరిస్థితులు ఏర్పడటం వల్లనే.. ఇలాంటి కథనాలు సాక్షి ప్రారంభించిందనే.. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కృష్ణా డెల్టా కోసం.. పట్టిసీమ పంపుల్ని ప్రారంభించారు. సాధారణం కృష్ణాకు ఇంత వరద వచ్చిన తర్వాత గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా నీటిని తీసుకునే సందర్భాలు ఉండవు. సహజంగా.. గోదావరి కంటే కృష్ణాకు ఆలస్యంగా వరదలు వస్తాయి. ఒక్కో సారి ఏ వరదా ఉండదు. ఈ పరిస్థితిని అధిగమించడానికి పట్టిసీమ నిర్మించారు చంద్రబాబు. ఇప్పుడు.. ఆ పట్టిసీమను.. వరదలు వచ్చినప్పటికీ.. ఉపయోగిస్తున్నారు. దీంతో.. కృష్ణానది వరద సద్వినియోగం కాలేదని.. సముద్రంలోకి వెళ్లిపోయిందని స్పష్టమయింది.
అందుబాటులో ఉన్న ప్రాజెక్టుల ద్వారా.. శ్రీశైలం ప్రాజెక్టుకు వెల్లువగా వచ్చిన వరదను..సీమకు తరలించాల్సి ఉంది. కానీ ఏపీ సర్కార్ ఉద్దేశం ఏమిటో కానీ… శ్రీశైలంలో 810 అడుగుల వద్ద నుంచి ముచ్చుమర్రి ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేసింది. చివరికి పోతిరెడ్డి పాడు ద్వారా కూడా.. 860 అడుగులకు చేరిన తర్వాతనే సీమకు నీటిని పంపింగ్ ప్రారంభించారు. దాంతో.. కనీసం 50 టీఎంసీల నీరు..సీమకు తగ్గిపోయిందన్న విశ్లేషణ సాగునీటి రంగంలో ప్రారంభమయింది. శ్రీశైలంలో 810 ఆడుగుల నీళ్లు ఉంటే చాలు ముచ్చుమర్రి పంపులు ఆన్ చేసుకోవచ్చు. 840 అడుగుల దగ్గర్నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా నీరు మళ్లించి బానకచర్ల క్రాస్రెగ్యులేటర్ నుంచి కేసీ కాలువ, ఎస్సార్బీసీ, తెలుగుగంగ ద్వారా సాగు, తాగునీరు సీమ జిల్లాలకు అందిస్తారు. ఈ నీటిని సీమ మొత్తం అందించడానికి.. హంద్రీనీవా సుజల స్రవంతి, మాల్యాల ప్రధాన లిఫ్టు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రెడీగా ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు వీటిని ఉపయోగించింది తక్కువ. ఇప్పుడు చంద్రబాబు కాలువలు తవ్వలేదంటూ.. కొత్త ఆరోపణ చేసి.. సరిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుపై నిందలేస్తే.. రైతులకు నీళ్లు అందుతాయా..?